చాలారోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకులకు తెలంగాణ సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్ ఇచ్చారు. అడిగిన వాటన్నిటికీ ఓకే చెప్పేశారు కూడా. ఆ భేటీ ముగిసిన వెంటనే.. కాంగ్రెస్ నాయకుల చుట్టూ విమర్శల జడివాన ముసురుకుంది. ఎన్నో అనుమానాలు.. మరెన్నో ప్రశ్నలు నేతల ఉన్నాయట.
ఏడేళ్ల తర్వాత సీఎం ఎందుకు పిలిచారో ఆలోచించలేదా?
తెలంగాణ కాంగ్రెస్ నాయకులు.. ప్రగతి భవన్‌కి వెళ్లడం పార్టీలో వివాదంగా మారుతోంది. సీఎం కేసీఆర్‌తో భేటీని వ్యూహం కాదు.. వ్యూహాత్మక తప్పిదమన్నది కొందరు నేతల అభిప్రాయమట. ముఖ్యమంత్రితో భేటీ అయిన ఓ నాయకుడికి పార్టీ సీనియర్ నేత ఒకరు ఫోన్ చేసి క్లాస్ తీసుకున్నారట. ప్రగతిభవన్‌కు వెళ్లకుండా ఉండాల్సింది.. కనీసం పార్టీ దృష్టికి తీసుకెళ్లినా బాగుండేది అనే చర్చ వచ్చిందట. ఏడేళ్ల తర్వాత సీఎం అపాయింట్‌మెంట్ ఇస్తే దానివెనక వ్యూహం ఏంటో ఆలోచించలేదా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సీఎం వ్యూహాత్మకంగా కాంగ్రెస్ నాయకులను పిలిచి.. సమస్యను సెటిల్ చేసినట్టుగా బయట ప్రచారం జరుగుతోందని.. దీనివల్ల కాంగ్రెస్‌పార్టీకి పొలిటికల్ మైలేజీ కంటే డ్యామేజ్ ఎక్కువగా జరిగిందనే ఫీలింగ్ సీనియర్లలో ఉందట.
read more : ఇండియాలో మరోసారి 50 మార్క్ దాటిన కరోనా కేసులు
టీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ బీ-టీమ్‌గా బీజేపీ ఆరోపణలు
రాష్ట్రంలో నీటి యుద్ధం జరుగుతుంది. ఆ అంశాన్ని కూడా సీఎంతో ప్రస్తావిస్తే బాగుండేదనే వారు లేకపోలేదు. ఒకవేళ దళితుల అంశమే మాట్లాడాలనుకుంటే.. దళితులకు ఇచ్చిన హామీలు.. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు.. అసైన్ భూముల వ్యవహారం కూడా చర్చిస్తే ఇంకా బెటర్‌గా ఉండేదని ఇంకొందరి అభిప్రాయం. అయితే.. అదనుకోసం చూస్తున్న బీజేపీ.. సీఎంతో కాంగ్రెస్ నేతల భేటీపై ఆరోపణల చేసింది. టీఆర్‌ఎస్‌కు B-టీమ్ కాబట్టే హుజురాబాద్ ఎన్నికల ముందు కలిసి మాట్లాడుకున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఆరోపించారు. ఈ ఆరోపణలపై సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క సీరియస్ అయ్యారు. మీ నియోజకవర్గంలో దళితులు చనిపోతే వదిలేస్తారా అని రఘునందన్‌రావును ఉద్దేశించి ప్రశ్నించారాయన. బీజేపీకి దళితులను చంపాలనే ఆలోచన తప్పితే.. వారి సంక్షేమం కోసం పనిచేయదని మండిపడ్డారు భట్టి.
సీఎంతో భేటీపై పార్టీలో చర్చించాల్సిందని కొందరు అభిప్రాయం
సీఎంతో భేటీపై బయటపార్టీల విమర్శలు ఎలా ఉన్నా.. కాంగ్రెస్ నేతల నుంచే దాడి ఎక్కువైంది. దళత కుటుంబానికి న్యాయం జరగడం మంచి పరిణామమే అయినా.. అది కాంగ్రెస్ వల్ల జరిగిందనేది జనాల్లోకి వెళ్లలేదన్న ఆవేదన ఉందట. ఇప్పటికే న్యాయ విచారణ మొదలైంది. జాతీయ ఎస్సీ కమిషన్ కూడా జోక్యం చేసుకుంది. అయితే ఈ సమయంలో టీఆర్‌ఎస్ వ్యూహాత్మకంగా అడుగులు వేసిందనే అభిప్రాయం కాంగ్రెస్ నేతల్లో ఉందట. పైగా సీఎం కేసీఆర్‌ను కలవాలని అనుకున్నప్పుడు పార్టీ నాయకులతో చర్చించి నిర్ణయం తీసుకుంటే బాగుండేదని మరికొందరి మాటగా ఉంది.
రాజగోపాల్‌రెడ్డిని వెంటబెట్టుకుని వెళ్లడంపై విమర్శలు
ఎదురయ్యే రాజకీయ పరిణామాలను జగ్గారెడ్డి ఆలోచించలేదా?
ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రావడం లేదు. బీజేపీలోకి వెళ్తారనే అనుమానాలు ఉన్నాయట. అలాంటి రాజగోపాల్‌రెడ్డిని వెంటబెట్టుకుని ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లడాన్ని కాంగ్రెస్‌లోని ఒక వర్గం తప్పుపడుతోంది. ఇటీవల కాలంలో వివిధ సమస్యలపై సీఎం మీద..ప్రభుత్వం మీద తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. ఆయన కూడా సీఎంను కలిసి బృందంలో ఉన్నారు. ఈ సమయంలో ప్రగతిభవన్‌కు వెళ్లితే ఎదురయ్యే రాజకీయ పరిణామాలను, విమర్శలను ఎందుకు ఆలోచించలేదని కాంగ్రెస్‌లో కొందరు ప్రశ్నిస్తున్నారట. సంగారెడ్డిలో మెడికల్ కాలేజీ ఏర్పాటు అనేది ప్రధాన అంశం కావడం వల్లే వెళ్లినట్టు జగ్గారెడ్డి చెబుతున్నప్పటికీ.. సీఎంను కలిసిన సందర్భం మాత్రం రాజకీయంగా సరైంది కాదనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో సాగుతోందట. మొత్తానికి సీఎంతో జరిగిన కాంగ్రెస్ నాయకులు భేటీ.. పార్టీలో అనేక ప్రశ్నలను లేవనెత్తుతోంది.
