Site icon NTV Telugu

IND Vs AUS: ఫ్యాన్స్ దెబ్బ.. హెచ్‌సీఏ అబ్బా.. మ్యాచ్ టిక్కెట్ల విక్రయంలో గందరగోళం

Hyderabad Cricket Association

Hyderabad Cricket Association

IND Vs AUS:  టీమిండియా, ఆస్ట్రేలియా టీ20లో తలపడుతుంటే ఆ మ్యాచ్ చూడాలని క్రికెట్ అభిమానులు పరితపిస్తారు. అందులోనూ ఆ మ్యాచ్ హైదరాబాద్‌లో జరుగుతుందంటే అభిమానులు ఊరికే ఉంటారా చెప్పండి. తమ అభిమాన క్రికెటర్లను ప్రత్యక్షంగా చూసి ఆనందించేందుకు ఈ మ్యాచ్ టిక్కెట్ల కోసం ఎగబడుతున్నారు. ఈ నెల 25న జరిగే మ్యాచ్ టిక్కెట్లను కొనుగోలు చేసేందుకు వివిధ రాష్ట్రాలు, తెలంగాణ జిల్లాల నుంచి భారీగా అభిమానులు హైదరాబాద్ నగరానికి తరలివచ్చారు. ఈ మేరకు జింఖానా గ్రౌండ్స్, ఉప్పల్ స్టేడియానికి భారీగా చేరుకున్నారు. అయితే ఆఫ్‌లైన్ టిక్కెట్లను విక్రయించడంలో హెచ్‌సీఏ తీవ్ర జాప్యం చేస్తోంది. దీంతో అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Read Also:Allu Arha: ఆమె చేతిలో ఓడిపోయిన అల్లు అర్జున్.. వీడియో వైరల్

ఈ మ్యాచ్ కోసం టిక్కెట్లను జింఖానా గ్రౌండ్స్‌లో విక్రయిస్తామని తొలుత హెచ్‌సీఏ ప్రకటించింది. అయితే జింఖానా మైదానంలో అటువంటి ఏర్పాట్లు కనిపించకపోవడంతో అభిమానులు ఉప్పల్ స్టేడియానికి వెళ్తున్నారు. కానీ అక్కడ కూడా నిరాశే ఎదురవుతోంది. మ్యాచ్ టిక్కెట్ల విషయంలో హెచ్‌సీఏ గోల్‌మాల్ చేస్తోందంటూ అభిమానులు మండిపడుతున్నారు. వాస్తవానికి ఈనెల 15న ఆన్‌లైన్‌లో టిక్కెట్లను విక్రయిస్తామని హెచ్‌సీఏ చెప్పింది. కానీ 39వేల టిక్కెట్లు పేటీఎంలో 10 నిమిషాల్లో ఖాళీ అయిపోయాయి. దీంతో ఆఫ్‌లైన్‌లో అయినా మ్యాచ్ టిక్కెట్లను కొనుగోలు చేయాలని అభిమానులు భావించారు. కానీ ఇప్పటి వరకు ఆఫ్‌లైన్‌లో టిక్కెట్ల జాడ లేకపోవడంతో అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వందలాదిగా చేరుకున్న అభిమానులను ట్రాఫిక్‌కు ఇబ్బంది లేకుండా ఉండేలా చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీఛార్జి కూడా చేస్తున్నారు. అటు ఈ అంశంపై ఓ న్యాయవాది కూడా హెచ్ఆర్సీని ఆశ్రయించారు. అభిమానుల గందరగోళం నేపథ్యంలో హెచ్‌సీఏ దిగి వస్తుందేమో వేచి చూడాలి.

Exit mobile version