CPI Narayana comments on Junior NTR meeting Amit Shah: ఇటీవల సినీనటుడు జూనియర్ ఎన్టీఆర్, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ. అమిత్ షాపై ధ్వజమెత్తారు ఆయన. బీజేపీ సీనిమా యాక్టర్ల కాళ్లు పట్టుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. జూనియర్ ఎన్టీఆర్ ఏం ఖర్మ పట్టిందని అమిత్ షా ప్రశ్నించారు. జూనియర్ ఎన్టీఆర్ తాత, తండ్ర మంచివారని.. నీకు ఏం గతి పట్టిందని అమిత్ షాను కలిశావు అంటూ ప్రశ్నించారు. జూనియర్ ఎన్టీఆర్ క్రిమినల్ అయిన అమిత్ షా దగ్గరకు ఎందుకు వెళ్లాలని అడిగారు.
మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అమిత్ షా ఓ స్మగ్లర్ అంటూ ఆరోపించారు. మల్టీ బిలియనీర్ అదానీపై కూడా విమర్శలు గుప్పించారు నారాయణ. పనికిమాలిన పనులు చేస్తేనే తొందరగా ధనవంతులు అవుతారని విమర్శించారు. గుజరాత్ వాళ్లు దేశాన్ని దోచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Dawood Ibrahim: దావూద్ ఇబ్రహీం అండ్ గ్యాంగ్‌పై రివార్డు ప్రకటించిన ఎన్‌ఐఏ..
కేసీఆర్ బీహార్ వెళ్లీ సీఎం నితీష్ కుమార్, ఆర్జేడీ నేతలు లాలూ ప్రసాద్ యాదవ్, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ లను కలవడాన్ని స్వాగతించారు. కేసీఆర్ బీహార్ వెళ్లి అక్కడ నాయకులను కలవడం ముఖ్య పరిణామం అని అన్నారు. బీజేపీ వ్యతిరేక కూటమిని కలిసినందుకు కేసీఆర్ ని అభినందిస్తున్నానని అన్నారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న అన్ని శక్తులను కేసీఆర్ కలవాలని కోరుకున్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దగ్గరకు కేసీఆర్ వెళ్లి బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటానికి ఒప్పించాలని అన్నారు. ఆప్ నాయకుల విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు కొండను తవ్వి ఎలుకనుి పట్టుకున్నాయని ఎద్దేవా చేశారు. కేసీఆర్ బీజేపీకి వ్యతిరేకంగా మారారు కాబట్టే కేంద్రం దర్యాప్తు సంస్థలు టార్గెట్ చేస్తున్నాయని ఆరోపించారు.
దేశం పూర్తిగా అంబానీ, అదానీల గుప్పిట్లో ఉంది.
దేశం పూర్తిగా అదాని, అంబానీల చెప్పుచేతుల్లోకి వెళ్లిపోతుందని అన్నారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి. సెప్టెంబర్4 నుంచి 7 వరకు శంషాబాద్ లో రాష్ట్ర మహా సభలు నిర్వహిస్తామని అన్నారు. అదానీ ఎక్కడి వాడని.. లక్షల కోట్ల రూపాయలు ఎలా సంపాదించారు..? అని ప్రశ్నించారు. మోదీ అండదండలతో అదానీ, అంబానీ అడ్డగోలుగా సంపాదిస్తున్నారంటూ విమర్శించారు. మా చిన్నప్పుడు విన్న టాటా, బిర్లాలు కనుమరుగైపోయారని అన్నారు. దేశంలో మతోన్మాదం పెరిగిపోయిందని.. తెలంగాణలో బీజేపీ ఆట సాగనివ్వం అని అన్నారు. తెలంగాణకు బీజేపీ నేతలు చేసిందేం లేదని.. విభజన హామీల్లో ఒక్కటి కూడా బీజేపీ అమలు చేయలేదని.. టీఆర్ఎస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని.. ప్రభుత్వం హామీలు నెరవేర్చకపోతే ప్రత్యక్ష పోరాటాలు చేస్తామని సవాల్ చేశారు. బీజేపీ నాయకులు తెలంగాణ చరిత్రను వక్రీకరిస్తున్నారని విమర్శించారు.
