CPI D Raja Speech In Khammam BRS Public Meeting: బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలిసి దేశాన్ని నాశనం చేస్తున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి డీ రాజా మండిపడ్డారు. వన్ పార్టీ వన్ లీడర్ విధానంతో బీజేపీ ముందుకెళ్తోందని.. మోడీ సర్కారు రాష్ట్రాల సమస్యలను పట్టించుకోకుండా, బడా బాబులకు రెడ్ కార్పెట్ పరుస్తోందని విమర్శించారు. ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ఆ పార్టీని ఓడించడమే అందరి ముందున్న కర్తవ్యమని అన్నారు. దేశం అతిపెద్ద సంక్షోభంలో ఉందని, దేశానికి బీజేపీ ప్రమాదికారిగా మారిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. మన దేశం హిందూ దేశంగా మారితే ప్రమాదకరమని రాజ్యాంగ రూపకర్త బీఆర్ అంబేద్కర్ ఆనాడే హెచ్చరించారని.. ఇప్పుడు అలాంటి పరిస్థితే కనిపిస్తోందని చెప్పారు.
Bhagwant Mann Singh: బీజేపీ ఒక జుమ్లా పార్టీ.. లూటీతంత్రం నడిపిస్తోంది
బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్ సమాఖ్య స్ఫూర్తిని దెబ్బతీస్తున్నాయని.. విద్య, ఆరోగ్యం, ఉద్యోగ అంశాలను కేంద్రం విస్మరిస్తోందని డీ రాజా ధ్వజమెత్తారు. ప్రధాని మోడీ పేదలు, రైతుల పక్షాన లేరని.. కార్పొరేట్ శక్తులకు మాత్రమే ఆయన కొమ్ముకాస్తున్నారని.. అదానీ, అంబానీ, టాటాబిర్లా జపం చేస్తున్నారని ఆరోపించారు. గవర్నర్ వ్యవస్థను బీజేపీ దుర్వినియోగం చేస్తుందని.. కేరళ, తమిళనాడు, తెలంగాణలో గవర్నర్లు హద్దుమీరుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను.. గవర్నర్లతో కేంద్రం ఇబ్బంది పెడుతోందన్నారు. రాజ్యాంగేతర శక్తిగా బీజేపీ మారుతోందన్నారు. బీజేపీ చెబుతున్నట్లు.. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ ఎక్కడుందని ప్రశ్నించారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్‌లు దేశ మౌలిక వ్యవస్థలనే మార్చేయాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌లకు వ్యతిరేకంగా పోరాటం కొనసాగాలని.. బీజేపీపై ఐక్య పోరాటానికి ఖమ్మం సభ నాంది కావాలని పిలుపునిచ్చారు.
Arvind Kejriwal: గవర్నర్లను మోడీ ఆడిస్తున్నారు.. బీజేపీని తరిమికొట్టాలి
ఇదే సమయంలో.. తెలంగాణ అన్ని రంగాల్లో పురోగమిస్తోందని కేసీఆర్ సర్కార్‌పై డీ రాజా ప్రశంశల వర్షం కురిపించారు. కరెంటు కోతలు లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ అని.. నిరంతర కరెంటు, శుభ్రమైన తాగునీరు అందుతున్న రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనని కొనియాడారు. రైతుబంధు, దళితబంధు పథకాలు ఆదర్శనీయమని.. రాబోయే రోజుల్లో కేసీఆర్ మరిన్ని మంచి పథకాలు తీసుకురావాలని సూచించారు. ప్రస్తుతం అందరూ కలిసి పోరాడితే తప్ప దేశాన్ని కాపాడుకోలేని పరిస్థితి వచ్చిందన్నారు. సెక్యులర్ పార్టీలన్నీ కలిసి.. బీజేపీ నుంచి దేశానికి విముక్తి కలిగించాలని వెల్లడించారు.