Site icon NTV Telugu

CP VC Sajjanar : తాగి డ్రైవింగ్ చేస్తే జైలుకే.. వారం రోజులు ‘స్పెషల్ డ్రైవ్’

Sajjanar

Sajjanar

CP VC Sajjanar : హైదరాబాద్ మహానగరంలో రోడ్డు భద్రతను మెరుగుపరచడమే కాకుండా, ప్రమాదాల వల్ల సంభవించే ప్రాణ నష్టాన్ని గణనీయంగా తగ్గించడమే లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసులు సరికొత్త కార్యాచరణను ప్రకటించారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడిపి, తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలోకి నెట్టే వాహనదారులపై ఉక్కుపాదం మోపాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు నిర్ణయించారు. ఈ నేపథ్యంలో, రాబోయే క్రిస్మస్ , నూతన సంవత్సర వేడుకలను దృష్టిలో ఉంచుకుని, నగరం వ్యాప్తంగా 2025 డిసెంబర్ 24 నుండి డిసెంబర్ 30 వరకు వారం రోజుల పాటు ప్రత్యేక ఎన్‌ఫోర్స్‌మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడాన్ని ఏమాత్రం సహించేది లేదని, నిబంధనలు ఉల్లంఘించే వారి పట్ల పోలీసులు అత్యంత కఠినంగా వ్యవహరిస్తారని ఆయన స్పష్టం చేశారు.

Medaram : భక్తులకు గమనిక.. రేపు మేడారంలో దర్శనాలు నిలిపివేత.!

మోటార్ వాహనాల చట్టం–1988లోని సెక్షన్ 185 ప్రకారం మద్యం తాగి పట్టుబడే వారికి సుమారు పదివేల రూపాయల వరకు జరిమానా విధించడంతో పాటు, నేరం తీవ్రతను బట్టి గరిష్టంగా ఆరు నెలల జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉందని కమిషనర్ హెచ్చరించారు. కేవలం జరిమానాలతో సరిపెట్టకుండా, పునరావృత నేరస్తుల విషయంలో కఠినమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎవరైనా పదే పదే మద్యం తాగి వాహనం నడుపుతూ పట్టుబడితే, వారి డ్రైవింగ్ లైసెన్స్‌ను మూడు నెలల నుంచి శాశ్వతంగా రద్దు చేసే అధికారం పోలీసులకు ఉంటుందని పేర్కొన్నారు. ఒకవేళ మద్యం మత్తులో వాహనం నడుపుతూ ప్రమాదం చేసి ఎవరికైనా హాని కలిగిస్తే, అటువంటి వారిపై భారతీయ న్యాయ సంహిత (BNS) లోని అత్యంత కఠినమైన సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.

నగరంలో మైనర్లు వాహనాలు నడపడం పట్ల కూడా కమిషనర్ ఆందోళన వ్యక్తం చేశారు. మైనర్లు డ్రైవింగ్ చేయడం చట్టరీత్యా నేరమని, ఒకవేళ మైనర్లు వాహనాలు నడుపుతూ పట్టుబడితే సదరు వాహన యజమానులు లేదా తల్లిదండ్రులను బాధ్యులుగా చేస్తూ వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ గారు గట్టిగా చెప్పారు. రోడ్డు భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, ప్రతి పౌరుడు ఇందులో భాగస్వామి కావాలని ఆయన కోరారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు సంబంధించి ప్రజలు తమకు తెలిసిన సమాచారాన్ని పోలీసులకు చేరవేయవచ్చని, ఇందుకోసం 8712661690 వాట్సాప్ నంబర్ లేదా 9010203626 ట్రాఫిక్ హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. అలాగే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లైన ఫేస్‌బుక్ , X ద్వారా కూడా ఫిర్యాదులను స్వీకరిస్తామని, ప్రజల సహకారంతోనే సురక్షితమైన హైదరాబాద్‌ను నిర్మించగలమని ఆయన ఆకాంక్షించారు.

Shivaji : నటుడు శివాజీకి మహిళా కమిషన్ షాక్.. కేసు నమోదు, విచారణకు హాజరు కావాలని ఆదేశం!

Exit mobile version