CP Mahesh Bhagwat Reveals Safety Arrangements At Uppal Stadium: ఈనెల 25న (ఆదివారం) ఉప్పల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టీ20 మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే! ఈ నేపథ్యంలోనే అధికారులు అక్కడ భారీఎత్తున భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఎలాంటి అనివార్య సంఘటనలు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. దీనిపై రాచకొండ సీపీ మహేశ్ భగవత్ మాట్లాడుతూ.. మొత్తం 40 వేల మంది క్రీడాభిమానులు మ్యాచ్ చూసేందుకు ఉప్పల్ స్టేడియంకి వస్తారని, ట్రాఫిక్, లా & ఆర్డర్ సమస్యలు రాకుండా ఏర్పాట్లు చేపట్టామని తెలిపారు. మొత్తం 2500 మంది సిబ్బందితో ఈ ఏర్పాట్లు నిర్వహించినట్టు పేర్కొన్నారు.
ఉప్పల్ స్టేడియం బయటున్న అప్రోచ్ రోడ్లను తమ అధీనంలోకే తీసుకున్నామని సీపీ మహేశ్ భగవత్ పేర్కొన్నారు. ఆటగాళ్లందరూ ఈరోజు రాత్రికి నాగ్‌పూర్ నుంచి వస్తున్నారని.. వారికి కావాల్సిన ఏర్పాట్లన్నింటిని రెండు హోటల్స్‌లో జరిగాయని అన్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా.. మెట్రోను రాత్రి ఒంటిగంట వరకు తిప్పాలని తాము విజ్ఞప్తి చేశామన్నారు. ఆర్టీసీకి కూడా అదనపు బస్సుల కోసం లేఖ రాశామన్నారు. స్టేడియం వద్ద ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయని, 300 సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశామని అన్నారు. 21 పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేశామని, గేట్ నం.1 ద్వారా విఐపీ, వివిఐపీల కోసం ప్రత్యేక పార్కింగ్ సిద్ధం చేశామని వెల్లడించారు. ఒక్కొక్క పార్కింగ్‌లో 1400 ఫోర్ వీలర్స్ పట్టేలా ప్రత్యేక పార్కింగ్స్ ఏర్పాటు చేసినట్టుగా పేర్కొన్నారు.
స్టేడియం చుట్టూ మూడు జంక్షన్లు ఉన్నాయని.. సాయంత్రం నాలుగు గంటల నుండి స్టేడియం వైపు భారీ వాహనాలకు అనుమతి లేదని సీపీ తేల్చేశారు. మూడు చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్న ఆయన.. ఏక్ మీనార్ వద్ద ఎలాంటి పార్కింగ్‌కి అనుమతి లేదన్నారు. సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి ఒంటి గంట దాకా ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. ఐదు మొబైల్ పార్కింగ్‌లతో పాటు ఎమర్జెన్సీ వాహనాల కోసం ప్రత్యేక ఏర్పాటు చేసినట్లు సీపీ మహేశ్ భగవత్ చెప్పుకొచ్చారు.