హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఘోర వైఫల్యంపై హైకమాండ్ సీరియస్‌గా ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ నేతలకు హైకమాండ్ నుంచి పిలుపు వచ్చింది. ఈనెల 13న ఢిల్లీ రావాలని పీసీసీ అధ్యక్షుడు సహా సుమారు 13 మంది నేతలను హైకమాండ్ ఆదేశించింది. హుజూరాబాద్ ఓటమిపై ఏఐసీసీ స్థాయిలో సమీక్షించనున్నట్లు సమాచారం. ఉపఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్‌కు కేవలం మూడు వేల ఓట్లే రావడంపై హైకమాండ్ సీరియస్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ ఓట్ల శాతం దారుణంగా పడిపోవడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇప్పటికే హుజూరాబాద్ ఓటమిపై ఏఐసీసీ ఓ కమిటీ వేసింది.
Read Also: తెలంగాణ బీజేపీలో పాత నేతలు ఫీల్ అవుతున్నారా?
శనివారం ఢిల్లీకి రావాలని పీసీసీ నేతలతో పాటు హుజురాబాద్ అభ్యర్థి బల్మూరి వెంకట్‌ను కూడా హైకమాండ్ పిలిచింది. అయితే హుజురాబాద్ ఓటమికి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వైఖరే కారణమని కాంగ్రెస్ పార్టీ సీనియర్లు గట్టిగా ఆరోపిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం కోసం రేవంత్ పనిచేశారని వారు హైకమాండ్ దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలుస్తోంది. మరోవైపు హుజురాబాద్ ఉపఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కనీసం సహకరించలేదని రేవంత్ వర్గం గుర్తు చేస్తోంది. ముఖ్యంగా హుజురాబాద్ ఎన్నిక పార్టీల మధ్య జరగలేదని.. కేసీఆర్, ఈటల మధ్య జరిగిందని రేవంత్ వర్గం హైకమాండ్‌కు నచ్చచెప్పే పనిలో ఉంది.
