NTV Telugu Site icon

Power Bill: ఖాళీ పోర్షన్‌కు రూ.7 లక్షల బిల్లు.. షాక్‌ లో ఇంటి యజమాని

Power Bill

Power Bill

Power Bill: మామూలుగా అయితే కరెంట్ ముట్టుకుంటే షాక్ అవుతారు. విద్యుత్ అధికారుల నిర్వాకం వల్ల వినియోగదారులు కరెంట్ ముట్టుకోకుండానే షాక్ కొట్టినంత పనవుతుంది.. కరెంట్ బిల్లులు అలా ఉంటాయి మరి. రెండు గదుల ఇళ్లకు వేలల్లో బిల్లులు పెట్టిన అనేక ఉదంతాలు ఇటీవల వెలుగులోకి వస్తున్నాయి. ఇంట్లో ఒక్క లైట్ లేదా ఫ్యాన్ వాడినా.. వేలల్లో కరెంట్ బిల్లులు రీడింగ్ లు తీసిన ఘటనలు అనేకం. తాజాగా హైదరాబాద్‌లోని ఉప్పల్ ప్రాంతంలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. విద్యుత్ అధికారులు రూ. 7 లక్షలు బిల్లు పెట్టారు. అది చూసిన వినియోగదారులు కరెంట్ ముట్టుకోకుండానే షాక్ తిన్నారు.

ఉప్పల్ పరిధిలోని హైకోర్టు కాలనీలోని ఓ ఇంటికి రూ.7,97,576 బిల్లు వచ్చింది. గ్రౌండ్ ఫ్లోర్ లో ఖాళీగా ఉన్న పోర్షన్ కు ఏడు లక్షల కరెంట్ బిల్లు రావడంతో ఇంటి యజమాని ఆశ్చర్యానికి గురయ్యాడు. కాస్త షాక్ అయ్యాడు. గతంలో రూ.150 నుంచి రూ.250 వరకు ఉన్న కరెంట్ బిల్లు ఒక్కసారిగా ఏడు లక్షలకు పైగా పెరిగింది. తన ఇంటికి ఇంత బిల్లు ఎందుకు వస్తోందని విద్యుత్ అధికారులను సంప్రదించగా వారు పొంతన లేని సమాధానాలు చెప్పారని బాధితుడు వాపోయాడు. మీటర్ జంప్ వల్లే బిల్లు వచ్చిందని రీడింగ్ కు వచ్చిన అధికారులు తెలిపారు. మీటర్ మార్చాలని సూచించినట్లు యజమాని వెల్లడించారు. డీడీ కట్టినా విద్యుత్ అధికారులు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ చిత్రహింసలకు గురిచేస్తున్నారన్నారు. తప్పు విద్యుత్ అధికారులదే అయినా అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతా బాగానే ఉన్నా విద్యుత్ అధికారులు మాత్రం లంచాలు ఇవ్వకుండా పనులు చేయడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా తన సమస్యను పరిష్కరించాలని బాధితుడు వేడుకుంటున్నాడు.

ఇలాంటి ఘటనే గత ఏడాది అక్టోబర్ లో వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ పరిధిలో చోటుచేసుకుంది. పేద కుటుంబానికి చెందిన లక్ష్మయ్య అనే వ్యక్తి ఇంటి కరెంట్ బిల్లు 51,249 రూపాయలు వచ్చింది… తనకున్నది మూడు రూమ్‌లేనని, తాను నిరుపేద కుటుంబానికి చెందిన వాడని.. నాకు ఇంత కరెంట్ బిల్లు ఎలా వచ్చిందని ఆశ్చర్యానికి గురయ్యాడు… అయితే, గత మూడు నెలల క్రితం 32000 వేల రూపాయల కరెంట్ బిల్లు వచ్చిందని, విద్యుత్ అధికారులకు కంప్లైంట్ చేస్తే వారు మీటర్ రీడింగ్ లో పొరపాటు జరిగిందని, బిల్లును తీసుకొని వెళ్లి 5000 రూపాయాలు కడితే చాలు అని చెప్పి 5000 వేలు యజమానితో కట్టించుకున్నారని తెలిపారు.
Beauty Tips: ఈ జ్యూస్ ను ఒక్కసారి తాగితే చాలు.. నిత్య యవ్వనంగా ఉంటారు..