Command and Control Centre inauguration-Traffic advisory issued: హైదరాబాద్ నగరానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన కమాండ్ కంట్రోల్ సెంటర్ ను రేపు ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా గురువారం ప్రారంభం కానుంది. రూ. 600 కోట్ల వ్యయంతో నిర్మించిన కమాండ్ కంట్రోల్ సెంటర్ ని మంగళవారం మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సమీక్షించారు. పలువురు వీఐపీలు హాజరవుతుండటంతో భద్రతా పరమైన ఏర్పాట్లను పోలీసులు పర్యవేక్షించారు. సేఫ్ సిటీ ప్రాజెక్టు, కమ్యూనిటీ సీసీటీవీ ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన 9.22 లక్షల సీసీ కెమెరాలను ఈ కేంద్రంతో అనుసంధానిస్తారు. పోలీసులు ఏ క్షణంలో అయినా లక్ష కెమెరాలను పర్యవేక్షించేలా తీర్చిదిద్దారు. క్షేత్ర స్థాయిలో పోలీసింగ్కు మద్దతుగా తెరవెనక పనిచేసే టెక్నికల్ టీంతో వార్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా అనలిటిక్స్, సోషల్ మీడియా యూనిట్లు కూడా కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉండనున్నాయి.
Read Also: Munugode By Elections : :మునుగోడు లో ఉప ఎన్నిక అభ్యర్థి కోసం కాంగ్రెస్ వేట..?
గురువారం కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవం నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సం కారణంగా హైదరాబాద్ పోలీసులు ట్రాఫిక్ సూచనలు చేశారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉండనున్నాయి. ఎన్టీఆర్ భవన్ నుంచి అపోలో ఆస్పత్రి, ఫిల్ద్ నగర్ వైపు వచ్చే ట్రాఫిక్ జూబ్లీహిల్స్ చెక్ పోస్టు, మాదాపూర్, సైబరాబాద్ వైపు మళ్లింపు, మాసాబ్ ట్యాంక్ నుంచి రోడ్ నెంబర్ 12 వచ్చే వాహనాలను బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 క్యాన్సర్ ఆస్పత్రి వైపు మళ్లించనున్నారు. ఫిల్మ్ నగర్ నుంచి వచ్చే ట్రాఫిక్ జూబ్లీ హిల్స్ చెక్ పోస్టు, ఎన్టీఆర్ భవన్ వైపు మళ్లించనున్నారు.
