కాళేశ్వరంలో మళ్ళీ కరోనా కలకలం రేపింది. గత కొన్ని రోజుల నుండి మరల కరోనా తీవ్రస్థాయిలో విజృంభిస్తోంది. కాళేశ్వరం గ్రామంలోనే 50కి పైన పాజిటివ్ కేసులు నమోదైయ్యాయి. థర్డ్ వేవ్ ను దృష్టిలో ఉంచుకొని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ముందస్తుగా కాళేశ్వర గ్రామాన్ని కంటైన్మెంట్ జోన్ గా ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాళేశ్వరం దేవస్థానంకు వచ్చే భక్తులు గాని, ప్రాజెక్టు సందర్శనకు వచ్చే యాత్రికులు గాని మరియు అస్తికలు కలుపుటకు వచ్చే వారుగాని ఇక్కడి కరోనా తీవ్రత తగ్గి.. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.
కాళేశ్వర గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న దుకాణాలు, కిరాణా షాపులు, నిత్యవసర సరుకులు ఉదయం 07 గంటల నుండి 11 గంటల వరకు మాత్రమే తెరిచి ఉండాలన్నారు. కాళేశ్వరం దేవస్థాన దైవదర్శనం కూడా ఉదయం 07 గంటల నుండి 12 గంటల వరకు అనుమతి ఉంటుందన్నారు. ఇట్టి సమయాన్ని గ్రామస్తులు ఉపయోగించుకోవాలని.. 11 గంటల తర్వాత ఎవరు బయటకు రావద్దని తెలియజేశారు. ఈ సమయం ఎవరైనా అతిక్రమించి కిరాణా షాపులు, దుకాణాలు తెరిచిన ఎవరైనా బయటికి వచ్చిన వారిపై కఠిన చర్యలు తీసుకోబడతాయన్నారు.
