NTV Telugu Site icon

CM Revanth Reddy: నేడు సీఎం పుట్టినరోజు.. యాదాద్రిని దర్శించుకోనున్న రేవంత్ రెడ్డి.

Revanth Reddy

Revanth Reddy

CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం యాదాద్రిభువనగిరి జిల్లాలో పర్యటించనున్నారు. సీఎం పుట్టినరోజు సందర్భంగా యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం ప్రభుత్వం చేపట్టిన మూసీ పునరుజ్జీవన కార్యక్రమంలో భాగంగా నదీ పరివాహక ప్రాంతాల్లో పర్యటించి ప్రజలతో మమేకమవుతారు. ఈ మేరకు జిల్లా యంత్రాంగంలో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పూర్తి చేశారు. సీఎం పర్యటన సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. యాదగిరిగుట్టతో పాటు వలిగొండ మండలం సంగెం అండర్ బ్రిడ్జి వద్ద కట్టుదిట్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన వివరాలు..

* ఉదయం 9 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. కుటుంబ సమేతంగా ఉదయం 9.20 గంటలకు హెలిప్యాడ్‌లో యాదగిరిగుట్టకు చేరుకుంటారు.

* హెలిప్యాడ్ నుంచి ఉదయం 9.30 గంటల నుంచి 10 గంటల వరకు వాహనాలు యాదగిరిగుట్టలోని ప్రెసిడెన్షియల్ సూట్‌కు చేరుకుంటాయి.

* ఉదయం 10.00 గంటల నుంచి 11.15 గంటల వరకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామికి ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు.

* 11.20 గంటలకు ప్రెసిడెన్షియల్‌ సూట్‌కు చేరుకుని 11.30 నుంచి ఒంటి గంట వరకు ఆలయ అభివృద్ధి పనులపై వీటీడీఏ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారు.

* మధ్యాహ్నం 1 నుంచి 1.30 వరకు భోజనం. 1.30 గంటలకు వలిగొండ మండలం సంగెం ప్రెసిడెన్షియల్ సూట్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరుతారు.

* మధ్యాహ్నం 2.10 నుంచి 3 గంటల వరకు బిమలింగం వద్ద పూజల్లో పాల్గొని నడక సాగిస్తారు.

* మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు రెండున్నర కిలోమీటర్ల మేర పాదయాత్ర చేపట్టనున్నారు. 4.30 గంటలకు ధర్మారెడ్డి కాలువ మీదుగా సంగెం-నాగిరెడ్డిపల్లి ప్రధాన రహదారికి చేరుకుంటారు.

* అనంతరం సాయంత్రం 4.30 నుంచి 5 గంటల వరకు నాగిరెడ్డిపల్లిలో వాహనంపై నుంచి ప్రజలనుద్దేశించి సీఎం ప్రసంగిస్తారు. సాయంత్రం 5 గంటలకు సంగెం నుంచి హైదరాబాద్‌కు బయలుదేరుతారు.

సీఎం పర్యటనకు ఏర్పాట్లు పూర్తి…

సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం తగు చర్యలు చేపట్టింది. వలిగొండ మండలం సంగెం వద్ద భీమలింగానికి పూజలు చేసిన అనంతరం పునరుజ్జీవం యాత్ర చేపడతారు. ఈ మేరకు భీమలింగం వరకు రోడ్డు ఏర్పాటు చేశారు. ఆ తర్వాత ధర్మారెడ్డి కాలువ మీదుగా సీఎం యాత్ర చేపట్టనున్నారు. భద్రతా సిబ్బంది బాంబు స్క్వాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్, వివిధ శాఖల అధికారులు ఎలాంటి లోటుపాట్లు లేకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. సీఎం దర్శనార్థం విష్ణుపుష్కరిణి, అఖండ దీపం, తూర్పు రాజగోపురం మీదుగా ఆలయంలోకి సీఎం భద్రతా సిబ్బంది వెళ్లి స్వయంభువుల దర్శనం, వేద ఆశీర్వాద మండపం, ఆలయ పరిసరాలు తదితర ప్రాంతాలను పరిశీలించారు. సీఎం పూజలు చేసే భీమలింగం వరకు సీఎం వాహనం ట్రయల్ రన్ నిర్వహించారు.
Astrology: నవంబర్ 08, శుక్రవారం దినఫలాలు

Show comments