Site icon NTV Telugu

CM Revanth Reddy : జాతి కోసం.. జనహితం కోసం.. గొప్ప కలలు కనాలంటే ధైర్యం ఉండాలి..

Revanth Reddy

Revanth Reddy

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న గ్లోబల్ సమ్మిట్‌కు హైదరాబాద్ నగరం సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. సోమ, మంగళవారాల్లో భారత్ ఫ్యూచర్ సిటీ వేదికగా జరగనున్న ఈ రెండు రోజుల సదస్సుకు దేశ, విదేశాల నుంచి ప్రతినిధులు హాజరవనున్న నేపథ్యంలో, సమ్మిట్ ప్రాంగణంతో పాటు నగరాన్ని ఆధునిక హంగులతో తీర్చిదిద్దుతున్నారు.

ఈ క్రమంలో, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్విట్టర్ వేదికగా తన సందేశాన్ని అందించారు. ‘జాతి కోసం… జనహితం కోసం… గొప్ప కలలు కనాలంటే ధైర్యం ఉండాలి… గొప్ప కార్యాలు చేయాలంటే…మహా సంకల్పం కావాలి… సరిగ్గా రెండేళ్ల క్రితం నాకు ఆ ధైర్యం ఇచ్చి…తమ ఓటుతో గెలుపు సంకల్పాన్ని ఇచ్చి… నిండు మనస్సుతో ఆశీర్వదించిన తెలంగాణ నాలుగు కోట్ల ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు.

ఈ రెండేళ్ల ప్రస్థానంలో… అనునిత్యం అహర్నిశలూ అవని పై తెలంగాణను శిఖరాగ్రాన నిలిపేందుకు తపనతో శ్రమించాను. గత పాలన శిథిలాల కింద కొనఊపిరితో ఉన్న నవతరానికి కొలువుల జాతరతో కొత్త ఊపిరి పోశాం. రుణభారంతో వెన్ను విరిగిన రైతుకు దన్నుగా నిలిచి దేశానికే ఆదర్శంగా నిలిపాం.

ఆడబిడ్డల ఆకాంక్షలకు ఆర్థిక మద్ధతు ఇచ్చి అదానీ, అంబానీల లెక్క వ్యాపారరంగంలో నిలిపాం. బలహీనవర్గాల వందేళ్ల ఆకాంక్షలను కుల లెక్కలతో కొత్త మలుపులు తిప్పాం. వర్గీకరణతో మాదిగ సోదరుల ఉద్యమానికి నిజమైన సార్థకత చేశాం. చదువొక్కటే బతుకు తెరువుకు బ్రహ్మాస్త్రం అని నమ్మి… యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూళ్ల నిర్మాణ యజ్ఞానికి పునాదులు వేశాం. స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీకి శ్రీకారం చుట్టాం.

స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానత్వం మూల సిద్దాంతంగా ముందుకు సాగుతున్నాం. “జయ జయహే తెలంగాణ” అన్న ప్రజాకవి అందెశ్రీ గేయానికి, జన ఆకాంక్షల మేరకు అధికారిక గుర్తింపు ఇచ్చాం. సన్నబియ్యం, ఇందిరమ్మ ఇళ్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆడబిడ్డలకు ఉచిత బస్సు పథకం, రూ.500 కే గ్యాస్, సన్న ధాన్యానికి రూ.500 బోనస్, కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేసే గొప్ప పథకాలన్నీ ఈ రెండేళ్ల సంక్షేమ చరిత్రకు సాక్ష్యాలు.

నేటి అవసరాలు తీర్చి, పేదల సంక్షేమం కూర్చి ఇదే అద్భుతం అని మేం సరిపెట్ట లేదు. స్వతంత్ర భారత ప్రయాణం వందేళ్ల మైలురాయికి చేరే సందర్భం 2047 నాటికి మన తెలంగాణ ఎట్లుండాలి… ఎక్కడ ఉండాలో లోతైన మథనంతో మార్గదర్శక పత్రం సిద్ధం చేశాం. గత పాలకులు కలలో కూడా ఊహించని విజన్ కు మేం ప్రాణం పోశాం. ప్రపంచ వేదిక పై #TelanganaRising రీ సౌండ్ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశాం. భారత దేశ గ్రోత్ ఇంజిన్ గా తెలంగాణను మార్చడానికి సర్వం సిద్ధం చేశాం. భారత్ ఫ్యూచర్ సిటీ రేపటి తెలంగాణ ప్రగతికి వేగుచుక్క. నిన్నటి వరకు ఒక లెక్క… రేపటి “తెలంగాణ గ్లోబల్ సమ్మిట్” తర్వాత మరో లెక్క.. నిన్న, నేడు, రేపు… మీ ఆశీర్వాదమే నా ఆయుధం.. మీ ప్రేమాభిమానాలే నాకు సర్వం… మీ సహకారమే నాకు సమస్తం.. తెలంగాణ నాకు తోడుగా ఉన్నంత వరకు… ఈ గొంతులో ఊపిరి ఉన్నంత వరకు… “TELANGANA RISING” కు తిరుగు లేదు.’ అని ఆయన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.

Exit mobile version