CM Revanth Reddy : ములుగు జిల్లా మేడారం మహాజాతరలో సీఎం రేవంత్ రెడ్డి ఆదివాసీల అభివృద్ధి, సమ్మక్క సారలమ్మ ఆలయ ప్రగతి అంశాలపై కీలక ప్రసంగం చేశారు. ఆయన మాట్లాడుతూ ఇది కేవలం ఒక బాధ్యత మాత్రమే కాకుండా, భావోద్వేగంతో కూడిన బాధ్యత అని అన్నారు. ఆనాటి పాలకులు ఆలయ అభివృద్ధిపై వివక్ష చూపారని విమర్శించారు. “సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతోనే నేను పాదయాత్ర మొదలుపెట్టా. 2023 ఫిబ్రవరి 6న ఈ గడ్డపై నుంచే తెలంగాణకు పట్టిన చీడ, పీడలను వదిలించేందుకు అడుగులు వేశాం” అని గుర్తుచేసుకున్నారు.
Kakinada : కాకినాడ ఉప్పాడలో మత్స్యకారుల ఆందోళన – సమస్యల పరిష్కారం కోరుతూ నిరసన
ఆదివాసీలు దేశానికి మూలవాసులని పేర్కొంటూ, వారి సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. ఐటీడీఏ ప్రాంతాల్లో అదనంగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసినట్లు చెప్పారు. ఏ సంక్షేమ పథకం అయినా ఆదివాసీల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని అమలు చేస్తున్నామని అన్నారు. “సమ్మక్క సారక్కల గద్దెల అభివృద్ధి, ప్రాంగణ పునర్నిర్మాణం మా జీవితంలో గొప్ప ఘట్టం. ఆలయ అభివృద్ధికి ఎన్ని కోట్లయినా ప్రభుత్వం మంజూరు చేసేందుకు సిద్ధం. ఈ కార్యక్రమంలో ఆదివాసీలు, పూజారులు, సంప్రదాయ కుటుంబాలందరినీ భాగస్వాములను చేస్తున్నాం” అని స్పష్టం చేశారు.
రాతి కట్టడాలు ఎప్పటికీ చరిత్రకు నిలువెత్తు సాక్ష్యాలుగా నిలుస్తాయని పేర్కొంటూ, ఆలయ నిర్మాణంలో రాతి కట్టడాలకే ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. మహాజాతరకు ముందే పనులు పూర్తిచేసేలా అధికారులు పగలు, రాత్రి పనిచేయాలని ఆదేశించారు. భక్తితో, సమ్మక్క మాలధారణ చేసినట్లుగా విధులు నిర్వర్తించాలని సూచించారు. అదే సమయంలో, కేంద్రంపై విరుచుకుపడిన సీఎం రేవంత్ రెడ్డి, “కుంభమేళాకు వేలకోట్లు ఇస్తున్న కేంద్రం, ఆదివాసీ కుంభమేళా మేడారం జాతరకు నిధులు ఎందుకు ఇవ్వడంలేదు? జాతీయ స్థాయిలో మేడారం జాతరకు గుర్తింపు ఇవ్వాలని, నిధులు మంజూరు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నాం” అని స్పష్టం చేశారు. మహాజాతర సమయంలో తిరిగి వచ్చి, ఈ జాతరను మరింత ఘనంగా నిర్వహిస్తామని భక్తులకు హామీ ఇచ్చారు.
