CM Revanth Reddy: కొడంగల్‌లో సీఎం రెండు రోజుల పర్యటన.. ఫుల్ షెడ్యూల్ ఇదే!

Cm Revanth Reddy

Cm Revanth Reddy

CM Revanth Reddy: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రెండు రోజులపాటు కొడంగల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నియోజకవర్గంలో కొనసాగుతున్న పలు అభివృద్ధి, విద్యా సంస్థల నిర్మాణ పనులను సీఎం స్వయంగా పరిశీలించనున్నారు. అనంతరం నియోజకవర్గ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. షెడ్యూల్ ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు మద్దూరులోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించనున్నారు. అదే ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ పనులను కూడా పరిశీలించనున్నారు. నిర్మాణ పనుల పురోగతి, నాణ్యత, ఇతర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకోనున్నారు. అనంతరం మధ్యాహ్నం 3.20 గంటలకు దౌల్తాబాద్ మండలం గోకఫసల్వాడ్‌లో నిర్మాణంలో ఉన్న బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్‌ను సీఎం సందర్శించనున్నారు. అక్కడ జరుగుతున్న పనుల పురోగతిని పరిశీలించడంతో పాటు అధికారులతో వివరాలు తెలుసుకోనున్నారు.

తర్వాత సాయంత్రం 4 గంటలకు దౌల్తాబాద్ పట్టణంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల పనులను పరిశీలించనున్నారు. అనంతరం 4.30 గంటలకు హకీంపేట ఎడ్యుకేషన్ హబ్‌కు చేరుకోనున్నారు. అక్కడ నియోజకవర్గంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి పనులపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమీక్షలో విద్య, మౌలిక వసతులు, సంక్షేమం తదితర అంశాలకు సంబంధించిన పనుల పురోగతిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీయనున్నట్లు తెలుస్తోంది. పెండింగ్‌లో ఉన్న పనులను వేగవంతం చేయడంతో పాటు నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని అధికారులకు సూచించే అవకాశం ఉంది. సమీక్ష సమావేశం అనంతరం సీఎం రేవంత్ రెడ్డి రోడ్డు మార్గంలో కొడంగల్‌కు చేరుకోనున్నారు. కొడంగల్‌లోనే రాత్రి బస చేయనున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా నియోజకవర్గంలోని మరిన్ని ప్రాంతాలను సందర్శించి అభివృద్ధి పనులను పరిశీలించే అవకాశం ఉంది.