CM Revanth Reddy : రేపు సీఎం రేవంత్ టూర్.. కరీంనగర్, సిరిసిల్లలో భారీ కార్యక్రమాలు

  • కరీంనగర్‌లో కొత్త కలెక్టరేట్ ప్రారంభం
  • అధికారులతో సీఎం రేవంత్ కీలక సమీక్ష
  • సిరిసిల్లలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు
  • రగుడు బైపాస్ వద్ద భారీ బహిరంగ సభ
Cm Revanth Reddy

Cm Revanth Reddy

తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి రేపు కరీంనగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలతో పాటు జిల్లా అధికారులతో సమీక్షా సమావేశంలో పాల్గొననున్నారు. సాయంత్రం సిరిసిల్లలో నిర్వహించే భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి ప్రసంగించనున్నారు.

కరీంనగర్‌లో కలెక్టరేట్ ప్రారంభోత్సవం.. అధికారులతో సమీక్ష

రేపు మధ్యాహ్నం కరీంనగర్ చేరుకోనున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నూతనంగా నిర్మించిన జిల్లా కలెక్టరేట్ భవన సముదాయాన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. దీనితో పాటు జిల్లా అభివృద్ధికి సంబంధించి పలు నూతన పనులకు శంకుస్థాపన చేయనున్నారు. కలెక్టరేట్ ప్రారంభోత్సవం అనంతరం జిల్లా ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించి, సంక్షేమ పథకాలు , ప్రాజెక్టుల పురోగతిపై దిశానిర్దేశం చేయనున్నారు.

సిరిసిల్లలో ఘన స్వాగతం.. బైపాస్ రోడ్డు వద్ద బహిరంగ సభ

కరీంనగర్ పర్యటన ముగించుకుని సాయంత్రం వేళ ముఖ్యమంత్రి సిరిసిల్లకు చేరుకుంటారు. సిరిసిల్ల అంబేద్కర్ చౌరస్తా నుంచి సభా ప్రాంగణం వరకు సీఎం రేవంత్ రెడ్డికి ఘన స్వాగతం పలుకుతూ భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. అనంతరం సభా ప్రాంగణం వద్ద వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు పూర్తి చేసిన తర్వాత, బైపాస్ రోడ్డు వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. సీఎం రాక సందర్భంగా ఇరు జిల్లాల్లోనూ అధికారులు, నాయకులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు.