NTV Telugu Site icon

CM KCR: అందరి స‌మ‌ష్టి కృషితో.. దేశంలోనే అనేక విషయాల్లో నంబర్ వన్‌లో ఉన్నాం

Cm Kcr Jagtial Speech

Cm Kcr Jagtial Speech

CM KCR Speech At Jagtial Collectorate Inauguration: జగిత్యాలలో నూతన కలెక్టర్ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్.. నూతన కటెక్టరేట్‌లలో ఇది 14వ కార్యాలయమని పేర్కొన్నారు. చక్కటి పరిపాలన భవనాన్ని నిర్మించుకొని.. తన చేతుల మీదు ప్రారంభించినందుకు ప్రజాప్రతినిధులకు, అధికారులకు సీఎం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమంలో అధికారులు పాత్ర ఎంతగానో ఉందన్నారు. తాను చెప్పినట్లే.. దేశంలో మరే రాష్ట్రంలో ఇవ్వనంత జీతాలను అధికారులకు ఇస్తున్నామన్నారు. తెలంగాణ ఏర్పడిన‌ప్పుడు రాష్ట్ర బడ్జెట్ కేవలం రూ. 62 వేల కోట్లు ఉంటే.. ఇప్పుడది రూ. 2 ల‌క్షల 20 వేల కోట్లు దాటిపోనుంద‌ని పేర్కొన్నారు. జీఎస్డీపీ, తలసరి ఆదాయంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచామన్నారు. భారతదేశంలోనే 24 గంటలు కరెంట్ ఇస్తోంది ఒక్క తెలంగాణ రాష్ట్రం మాత్రమేనని తెలిపారు.

గతంలో వ్యవసాయం నిరాదరణ అయి.. రైతులందరూ కూలీలుగా మారిన దీనస్థితి ఉండేదని కేసీఆర్ అన్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు కూడా అనిశ్చిత స్థితి ఉందన్నారు. కరెంట్ బాధలతో పాటు సాగనీళ్లు ఉండేవి కావన్నారు. వలసలు, కరువు, కారు చీకటి లాంటి పరిస్థితులు రాష్ట్రంలో ఉండేవన్నారు. అయితే.. రాష్ట్రం ఏర్పడిన అనతి కాలంలోనే ఆ ప్రతికూల పరిస్థితుల్ని అధిగమించామని చెప్పారు. ఉద్యమం చేసే సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతుందని, అది ధనిక రాష్ట్రంగా అవతరిస్తుందని చెప్పానని తెలిపారు. తాను చెప్పిందే నిజమైందన్నారు. అధికారులు సహా ఏ ఒక్కరినీ వదలకుండా.. అన్ని వర్గాల వారికి మేలు జరిగే విధంగా కార్యక్రమాల‌కు రూప‌క‌ల్పన చేస్తున్నామ‌న్నారు. ప్రజలందరూ సుఖంగా ఉండాలన్న ఉద్దేశంతో బేధాభిప్రాయం లేకుండా అనేక కార్యక్రమాలు శ్రీకారం చుట్టామని.. అవన్నీ విజ‌య‌వంతం అయ్యాయని పేర్కొన్నారు. అనేక మంది ఆర్థిక శాస్త్రవేత్తల‌తో చ‌ర్చించి, స‌రైన అంచ‌నాలు వేసి.. రాష్ట్రం ప్రస్థానాన్ని ప్రారంభించుకున్నామ‌ని చెప్పారు.

మ‌హారాష్ట్ర, మ‌ధ్యప్రదేశ్‌, గుజ‌రాత్‌తో పాటు ప‌లు రాష్ట్రాల‌ను జీఎస్‌డీపీలో, పంట‌ల ఉత్పత్తిలో, తలసరి విద్యుత్ వినియోగంతో పాటు అనేక రంగాల్లో మనం నంబర్ వన్‌గా ఎదిగామని కేసీఆర్ పేర్కొన్నారు. ఇదంతా కేవలం ఒక్క కేసీఆర్‌తో, ఒక్క సీఎస్‌తో లేదా మంత్రులతో సాధ్యం కాలేదని.. మనందరి సమిష్టి కృషితోనే సాధ్యమైందని చెప్పారు. క‌రువులు, వ‌ల‌స‌ల‌తో ఉన్న తెలంగాణను తక్కువ కాలంలోనే ఉన్నత స్థాయికి చేరుకునేలా కృషి చేశామన్నారు. దేశానికే ఆద‌ర్శంగా నిలిచామన్నారు. తెలంగాణలో ప్రస్తుతం గ్రామీణాభివృద్ధి జరుగుతోందన్నారు. ప్రభుత్వానికి నష్టం వచ్చినా.. సాగుకు సాయం చేసి, పంట కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని కేసీఆర్ వెల్లడించారు.