NTV Telugu Site icon

CM KCR: సీఎంగా ఉంటూనే.. దేశమంతా పర్యటిస్తా

Cm Kcr Speech

Cm Kcr Speech

CM KCR Speech After BRS Party Announcement: జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాక.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాలకు సీఎం కేసీఆర్ దూరం అవ్వొచ్చన్న అనుమానాలు ఉండేవి. అయితే.. ఇప్పుడు అలాంటి అనుమానాలు ఏమాత్రం అవసరం లేదు. ఎందుకంటే.. తాను తెలంగాణకు సీఎంగా ఉంటూనే దేశమంతా పర్యటిస్తానని, అందులో ఎవ్వరికీ ఎటువంటి అనుమానం అక్కర్లేదని స్వయంగా కేసీఆర్ ప్రకటించారు. తన టీఆర్ఎస్‌ను జాతీయ పార్టీ ‘బీఆర్ఎస్’గా ప్రకటించిన తర్వాత ఆయన ఆ స్పష్టతనిచ్చారు. ఉజ్వల భారతం తయారు కావాల్సిన అవసరమున్నదన్న ఆయన.. మన దేశంలో ఉన్న వనరుల్ని వాడితే, అమెరికా కంటే గొప్పగా అభివృద్ధి చెందుతామన్నారు.

ఏపని చేసినా అర్థవంతంగా, ప్రకాశవంతంగా చేయాలన్న కేసీఆర్.. తెలంగాణను సాధించుకున్న అనతికాలంలోనే వ్యవసాయం, విద్యుత్తు, సాగునీరు, తాగునీరు వంటి సమస్త రంగాలలో అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేసుకుంటూ పోతున్నామన్నారు. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో దేశాన్ని ఏలిన పార్టీలు కేవలం గద్దెనెక్కడం, గద్దెదిగడం తప్ప.. దేశానికి చేసిందేమీ లేదని అన్నారు. ఇతర పార్టీలకు రాజకీయాలు ఒక ఆట వంటిది కానీ.. టిఆర్ఎస్‌కి అదొక టాస్క్ అని చెప్పారు. తెలంగాణ వచ్చినప్పుడు తలసరి ఆదాయం ఒక లక్ష రూపాయలు మాత్రమే ఉండేదని.. కానీ ఇప్పుడు 2 లక్షల 78 వేల రూపాయలకు పెరిగిందన్నారు. అలాగే.. 2014లో జీఎస్డీపీ 5 లక్షల 6 వేలుంటే, నేడు 11 లక్షల 50 వేలకు చేరుకున్నదన్నారు. ఎలాగైతే కష్టపడి తెలంగాణని అభివృద్ధి ప్రగతిలో నడిపించామో.. అలాగే దేశం కోసం కష్టపడి, అభివృద్ధిని సాధించి చూపిద్దామని పిలుపునిచ్చారు.

జాతీయ పార్టీ పెట్టాలని ఆషామాషీగా తీసుకున్న నిర్ణయం కాదని.. అన్నీ బేరీజులు వేసుకొని, బలమైన పునాదుల మీద నుంచే తీసుకున్న నిర్ణయమని కేసీఆర్ అన్నారు. భారత దేశం రాష్ట్రాల సమాఖ్య అని.. రాష్ట్రాలు, దేశం కలిసి అభివృద్ధి చెందితేనే సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. మన దేశాన్ని లింగ, కుల వివక్షలు పట్టి పీడిస్తున్నాయని.. లింగ వివక్ష వల్ల దేశ జనాభాలోని సగం మహిళలు అభివృద్ధిలో భాగస్వాములు కాలేకపోతున్నారన్నారు. ఇక కుల వివక్ష కారణంగా.. దేశ జనాభాలో 20 శాతం ఉన్న దళితులు కూడా దేశ అభివృద్ధిలో భాగస్వామ్యం పంచుకోలేకపోతున్నారన్నారు. నేడు దళిత బంధు ప్రత్యేకంగా దళిత జనోద్దరణ కోసం అమలు చేస్తున్న కార్యక్రమమని.. దీని ద్వారా దళితులకు కూడా ఇతరుల్లాగే అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. రైతుబంధు పథకాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోందని అన్నారు.

దేశంలో నిర్లక్ష్యానికి గురైన మరో రంగం వ్యవసాయ రంగమని.. రైతులు తమ హక్కుల సాధన కోసం 13 నెలల పాటు రోడ్ల మీద ధర్నాలు చేసే పరిస్థితి తలెత్తడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. దేశ ప్రజల సమస్యలనే ఎజెండాగా చేసుకుని.. జాతీయ పార్టీ జెండాను పట్టుకుని ముందుకు సాగుతున్నామన్నారు. వనరులు ఉండి కూడా.. వాటిని సద్వినియోగం చేసుకోలేక దేశ ప్రజలు వంచించబడుతున్నారని, ఇది శోచనీయమని అన్నారు. ఈ పద్ధతిని మనమే మార్చాలని.. తెలంగాణను ఎలాగైతే బాగు చేసుకున్నామో, దేశాన్ని కూడా బాగు చేసుకుందామన్నారు. పలు రకాల పంటల్ని పండించి.. ప్రపంచానికి అవసరమైన ఆహార ఉత్పత్తులను అందించాలన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నల్లాలతోని నీల్లు ఇచ్చినట్టు.. దేశవ్యాప్తంగా ఇంటింటికి నల్లా అందించాలన్నారు. ఇందుకు యుద్ధాలు చేయాల్సిన అవసరం లేదని, చిత్తశుద్ధి ఉంటే చాలన్నారు.