Site icon NTV Telugu

CM KCR: శాంతిభద్రతల విషయంలో రాజీ పడేదే లేదు

Kcr Review Meeting

Kcr Review Meeting

CM KCR Review Meeting With Police Officers On Law and Order: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల కారణంగా హైదరాబాద్‌లో రెండ్రోజుల నుంచి ఆందోళనకరమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే పోలీసులు ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. ఈ పరిణామాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన సీఎం కేసీఆర్.. పోలీస్ అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీసు కమిషనర్లు సీవీ ఆనంద్, స్టీఫెన్ రవీంద్ర, మహేష్ భగవత్, ఇతర పోలీసు అధికారులతో ప్రగతిభవన్‌లో కేసీఆర్ సమావేశమయ్యారు. శాంతిభద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని.. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. సున్నితమైన అంశాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని.. సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాలని కేసీఆర్ చెప్పారు. పరిస్థితులను ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు.

ఇదిలావుండగా.. మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో.. ఆ వర్గానికి చెందిన ప్రజలు నగరంలో నిరసనలకు దిగారు. రాజాసింగ్‌ను అరెస్ట్ చేయాలని, అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ర్యాలీలు చేపట్టారు. అలాగే.. బండి సంజయ్ అరెస్ట్, ఎమ్మెల్సీ కవితపై లిక్కర్​స్కామ్​ ఆరోపణలపై బీజేపీ కార్యకర్తలు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని పరిణామాలు, శాంతిభద్రతలపై సీఎం ఆరా తీశారు. మరోవైపు.. పాతబస్తీలో ప్రశాంత వాతావరణం కొనసాగుతోందని అధికారులు తెలిపారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా యాక్షన్ ఫోర్స్ బలగాలను దించారు.

Exit mobile version