NTV Telugu Site icon

Buddha Purnima: బుద్ధుని బోధనలను స్మరించుకున్న కేసీఆర్‌..

Kcr

Kcr

గౌతమ బుద్ధుని జయంతి సందర్భంగా ఆయన బోధనలను స్మరించుకున్నారు తెలంగాణ సీఎం కె.చంద్రశేఖర్‌రావు.. ప్రపంచ మానవాళికి బుద్ధుడు నేర్పించిన శాంతి, సహనం, అహింసామార్గాలు నేటికీ అనుసరణీయమైనవని పేర్కొన్నారు.. తెలంగాణ నేల బౌద్ధానికి ప్రధానకేంద్రంగా వుందన్నారు. గోదావరి, కృష్ణా పరీవాహక ప్రాంతాలలో బౌద్ధం పరిఢవిల్లిందని.. కృష్ణానది ఒడ్డున ప్రకృతి రమణీయతల నడుమ అన్ని హంగులతో నాగార్జునసాగర్ లో అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణాన్ని పూర్తి చేసుకున్న బుద్ధవనం’ బౌద్ధ కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే ప్రారంభించి జాతికి అంకితం చేసిందని గుర్తుచేశారు.

బుద్ధుని జీవిత చరిత్ర, బోధనలు తదితర సమస్త సమాచారంతో కూడిన బుద్ధవనం ప్రపంచ ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా భాసిల్లనున్నదన్నారు సీఎం కేసీఆర్.. సర్వ జన సంక్షేమం, ప్రేమ, శాంతి, సహజీవనాలతో కూడిన ప్రగతి దిశగా గౌతమ బుద్ధుని మార్గంలో రాష్ట్ర ప్రభుత్వం పయనిస్తున్నదని తెలిపారు. కాగా, నాగార్జున సాగర్‌లో నిర్మించిన అంతర్జాతీయ బౌద్ధక్షేత్రం గత వారం నుంచి అందుబాటులోకి వచ్చింది. మంత్రి కేటీఆర్‌ బద్ధవనాన్ని ప్రారంభించారు. 247 ఎకరాల్లో అత్యద్భుతంగా రూపుదిద్దుకుంది బౌద్ధక్షేత్రం.. నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీలో 2003 సంవత్సరంలో అప్పటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ.42 కోట్లతో బుద్ధవనం ప్రాజెక్ట్‌ నిర్మాణ పనులు ప్రారంభించినా.. 2014 వరకు నిధుల కొరతతో పనులు అంతంత మాత్రంగానే సాగాయి.. 2015లో రూ.25కోట్లు మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం.. వడివడిగా పనులు సాగించింది.. మరికొన్ని నిర్మాణాలు చేయాల్సి ఉన్నా.. గత శనివారం ఆ క్షేత్రాన్ని అందుబాటులోకి తెచ్చింది.

Show comments