CM KCR: ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. వరదల కారణంగా పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. చాలా ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. ముఖ్యంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని మోరంచపల్లి గ్రామం జలమయమైంది. ఈ క్రమంలో ప్రగతి భవన్‌లో భారీ వరదలపై సీఎం కేసీఆర్ సమీక్ష నిర్వహించారు. సీఎస్ శాంతికుమారి వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని సీఎం కేసీఆర్‌కు ఎప్పటికప్పుడు వివరిస్తున్నారు. కాగా, వరద ప్రభావిత ప్రాంతాల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మోరంచపల్లిలో చిక్కుకుపోయిన ప్రజలను రక్షించేందుకు హెలికాప్టర్ పంపాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు.
Read also: Heart Transplant: జవాన్ ప్రాణాలు కోసం.. నాగ్‌పూర్ నుంచి గుండె.. పూణెలో ఆపరేషన్
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ సైనికాధికారులతో సీఎస్ శాంతికుమారి సంప్రదింపులు జరిపారు. సహాయక చర్యల్లో సాధారణ హెలికాప్టర్‌ను ఉపయోగించడం కష్టం కావడంతో ప్రభుత్వం సైన్యంతో చర్చలు జరుపుతోంది. కాగా, మోరంచపల్లిలో సహాయక చర్యల కోసం ఇప్పటికే ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను తరలించారు. సైన్యం అనుమతించిన వెంటనే హెలికాప్టర్ ద్వారా కూడా సహాయక చర్యలు చేపట్టనున్నారు. బుధవారం రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు భూపాలపల్లి జిల్లాలోని మోరంచవాగు ఉగ్రరూపం దాల్చింది. భూపాలపల్లి-పరకాల ప్రధాన రహదారిపై మోరంచపల్లి వద్ద సుమారు 15 అడుగుల ఎత్తులో ప్రవహిస్తోంది. దీంతో మోరంచపల్లి గ్రామం ముంపునకు గురైంది. ఇళ్లలోకి వరద నీరు రావడంతో భవనాలు, చెట్లపైకి ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. వరద ప్రవాహం పెరుగుతుండడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తమను కాపాడాలంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మోరంచపల్లి గ్రామంలో సుమారు వెయ్యి మంది జనాభా ఉన్నట్లు తెలుస్తోంది.
Rain Threat: ఏపీలో భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు పొంచిఉన్న ముప్పు..!