హైదరాబాద్‌లో 3 టిమ్స్ ఆసుపత్రులను నిర్మించబోతున్నట్లు తెలంగాణ సర్కార్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు సీఎం కేసీఆర్ 3 ప్రాంతాల్లో నూతనంగా నిర్మించబోతున్న టిమ్స్ ఆసుపత్రులకు భూమిపూజలు చేశారు. ఈ సంద్భంగా ఎర్రగడ్డలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న కేసీఆర్ మాట్లాడుతూ.. ఎండాకాలం వస్తే ఎమ్మెల్యే చావుకు వచ్చేదని.. నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఎక్కడ పోయినా.. బిందెలతో ప్రదన్శలు చేసేవారన్నారు. తెలంగాణ నీళ్లు లేక ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నామన్నారు.
మిషన్ భగీరథ పుణ్యమా అని ఇప్పుడు బిందెల ప్రదర్శన తెలంగాణలో బందైపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. తెలంగాణ రాష్ట్ర అన్ని రంగాల్లో ముందుందని అన్నారు. అంతేకాకుండా రానున్న రోజుల్లో విద్యా, వైద్యంపై మరింత దృష్టి సారించనున్నట్లు ఆయన వెల్లడించారు. 33 జిల్లా కేంద్రాల్లో ఎక్కడికక్కడ మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. ప్రజలందరికీ నాణ్యమైన ఉచిత విద్య అందించేలా ప్రభుత్వం ఆలోచన చేస్తోందని ఆయన అన్నారు. అంతేకాకుండా ప్రజల సహకారంతోనే ముందుకు వెళ్తున్నామని ఆయన అన్నారు.
