టీఆర్ఎస్ 21వ ప్లీనరీ సమావేశాలు హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో నగర ప్రధాన కూడళ్లు గులాబీమయంగా మారాయి. టీఆర్ఎస్ ప్లీనరీ వేడుకల్లో భాగంగా హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీ ఏర్పాటు చేసిన సభ ప్రాంగణంలో టీఆర్ఎస్ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ జాతీయ రాజకీయాలపై కీలక విషయాలు వెల్లడించారు. నేడు ప్లీనరీ సమావేశాల్లో కేసీఆర్ జాతీయ రాజకీయాల గురించి ప్రస్తావిస్తరని పలు పత్రికలు, న్యూస్ చానెళ్లలో వస్తోందన్న కేసీఆర్.. 75 సంవత్సరాల స్వాతంత్రంలో దేశంలో ఏం జరిగిందో దేశవాసులందరికీ తెలుసునన్నారు.
ఇందులో బ్రహ్మపదార్థమేది లేదని.. అందరికీ తెలిసిన విషయమేనన్నారు. స్వాతంత్ర ఫలాలు ప్రజలకు లభించలేదని, అనేక విషయాలపై చర్చోపచర్చలు జరిగి, పెడధోరణిలో పోతున్నయే తప్పా.. మంచి మార్గం కానరావడం లేదన్నారు. ఇటీవల కాలంలో.. దేశంలో కొన్ని జాడ్యాలకు, ఆనారోగ్యకరమైనటువంటి ధోరణులు ప్రబలుతున్నాయన్నారు. ఇది భారత సమాజానికి ఏమాత్రం మంచిదికదాన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక రాజకీయ పార్టీగా.. ఒక రాష్ట్రంగా.. మనమేం చేయాలి.. మన కర్తవ్యం ఏమిటి.. మన ఆలోచన ధోరణి ఏవిధంగా ఉండాలనే.. జాతీయ రాజకీయాల్లో ఏవిధమైన పాత్ర పోషణ చేయాలని ఖచ్చితంగా నిర్ణయం తీసుకుంటామన్నారు.
