హైదరాబాద్ శివారులోని ముచ్చింతల్‌లో శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఘనంగా ముగిసిన విషయం తెలిసిందే.. అయితే, ఈ నెల 14వ తేదీన శాంతి కళ్యాణం జరగాల్సి ఉండగా.. శనివారం సాయంత్రం అనగా రేపు శాంతి కళ్యాణం నిర్వహించనున్నట్టు వెల్లడించారు చిన్నజీయర్ స్వామి.. సాయంత్రం 5 గంటలకు ప్రారంభించి రాత్రి 8 గంటల తర్వాత శాంతి కళ్యాణాన్ని పూర్తిచేయనున్నట్టు తెలిపారు.. రామానుజ చార్యుల సోపాన మార్గంలో కళ్యాణము నిర్వహిస్తామని.. 108 కళ్యాణాలు ఒకే చోట జరిగిన చరిత్ర లేదన్నారు.. ఇక, అందరికి ప్రసాధాలు ఇచ్చి పంపిస్తాం.. అందరిని ఆహ్వానిస్తున్నాం.. అందరిని రండి… రండి అని చెబుతాం… రాకండి రాకండి అని చెప్పే అలవాటు లేదంటూ వ్యాఖ్యానించారు.
Read Also: Real Estate : ఇక, ప్రభుత్వ వెంచర్లు..! కసరత్తు ప్రారంభం..
ఇక, ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్‌తో విభేదాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చిన్న జీయర్ స్వామి… కేసీఆర్‌తో మాకు విభేదాలు ఎందుకు ఉంటాయి..? అని ప్రశ్నించారు… సీఎం కేసీఆర్ పూర్తి సహకారం ఉన్నందుకే కార్యక్రమం విజయవంతం అయ్యిందన్న ఆయన.. ఈ కార్యక్రమానికి నేను మొదటి వాలంటీర్‌ను అని కేసీఆరే అన్నారని గుర్తుచేసుకున్నారు… కేసీఆర్‌తో విభేదాలు అని సృష్టించడమే సరికాదన్న ఆయన.. మేం కార్యక్రమానికి అందరినీ ఆహ్వానించం.. మాకు అందరూ సమానమే… అధికార పక్షాలు, విపక్షాలు, స్వపక్షం అంతా సమానమేనని స్పష్టం చేశారు.. ఇక, రేపటి కార్యక్రమానికి కూడా అందరినీ ఆహ్వానించామని తెలిపారు.. శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలకు ముస్లిం లీడర్లను కూడా ఆహ్వానించాం… అరబిక్ భాషలో కూడా ఆహ్వాన పత్రికలను అచ్చువేయించామని ఈ సందర్భంగా వెల్లడించారు. ప్రతి ఒక్కరికి ఇక్కడికి ఆహ్వానం ఉందని స్పష్టం చేశారు.. అందరిని రండి… రండి అని చెబుతాం.. రాకండి రాకండి అని చెప్పే అలవాటు లేదన్న ఆయన.. ఇక, రామానుజ చార్యుల విగ్రహాన్ని ప్రతి రోజు మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 7 గంటల వరకు దర్శనానికి అనుమతి ఇస్తున్నామని తెలిపారు.. వీలు అయితే ఆదివారం నుంచి రామానుజ సువర్ణ మూర్తి దర్శనంకు కార్యనిర్వహకులు ఏర్పాట్లు చేస్తున్నారని పేర్కొన్నారు చిన్న జీయర్ స్వామి.
