Chinajiyar Swamy who received the Padma Award: పద్మభూషణ్ అవార్డు అందుకున్న అనంతరం చినజీయర్ స్వామి స్పందించారు. సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న వాలంటీర్లకు లభించిన సత్కారమే అని అన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డుల రెండో విడత కార్యక్రమం బుధవారం జరిగింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను అందజేశారు. తెలుగు రాష్ట్రాల నుంచి త్రిదండి చినజీయర్‌కి పద్మభూషణ్ అవార్డు లభించింది. ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి పద్మశ్రీ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు.
ఈ అవార్డు వికాస్ తరంగిణి, జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ పేరుతో చేసిన సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా ప్రభుత్వం పద్మభూషణ్ ప్రదానం చేసింది. ప్రజల అవసరాలను గుర్తించి స్పందించి అందించే సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. “స్వీయ ఆరాధన, సర్వ ఆదరణ” నినాదాన్ని మేం తీసుకొచ్చామన్నారు. ఎవరు ఏ మతాన్ని, ఏ ధర్మాన్ని ఆచరించినా సరే సామాజిక సేవ విషయంలో అందరం కలసి పనిచేయాలన్నదే ఈ నినాదం లక్ష్యం అని తెలిపారు. స్వధర్మాన్ని ఆచరిస్తూ, ఇతర ధర్మాలను ఆదరిస్తూ కుల, మత, ప్రాంత, లింగ బేధాలు లేకుండా సేవ చేయాలన్నదే మా ఉద్దేశమన్నారు. ప్రకృతి కన్నెర్ర చేయడం ఉండదు. కానీ వైపరీత్యాలకు మనిషిలోని అత్యాశే కారణమన్నారు. ఒక జంతువు మరో జంతువును అవసరానికే చంపుతుందని వ్యాఖ్యానించారు.
కానీ మనిషి మాత్రం అత్యాశతో ప్రకృతి వనరులను ధ్వంసం చేస్తున్నాడని అన్నారు. మానవ సేవయే మాధవ సేవ అనే మాటను “సర్వ ప్రాణి సేవయే మాధవ సేవ”గా మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడిందని తెలిపారు. భగవంతుడు గుడికి, గుండెకు మాత్రమే పరిమితం కాదన్నారు. భగవంతుడు సర్వాంతర్యామి. ప్రపంచమే ఆయన శరీరమని, ఎక్కడ ఏ ఉపద్రవం వచ్చినా భగవంతుడి శరీరానికి హాని కలిగినట్టుగా భావించి, మనం సేవ చేయాలన్నారు. మహిళలకు గర్భకోశ క్యాన్సర్ల విషయంలో వికాస తరంగిణి ద్వారా సేవా కార్యక్రమాలను చేస్తున్నామని తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, బెంగాల్, నేపాల్‌లో సుమారు 20 లక్షల మంది మహిళలకు క్యాన్సర్ పరీక్షలు నిర్వహించి, 6-7 లక్షల మందికి చికిత్స అందించామన్నారు. పద్మభూషణ్ అవార్డు ద్వారా మనం చేసే సేవా కార్యక్రమాలపై బాధ్యత, జవాబుదారీతనం మరింత పెరిగిందన్నారు. మరింత మెరుగ్గా, నేర్పరితనంతో సామాజిక అవసరాలను గుర్తించి, స్పందించడం బాధ్యతగా భావించాలని తెలిపారు.
కాగా, గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 106 మందికి పద్మ అవార్డులు ప్రకటించగా.. వీరిలో 6 మందికి పద్మవిభూషణ్, 9 మందికి పద్మభూషణ్, 91 మందికి పద్మశ్రీ లభించాయి. ఈసారి తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణకు చెందిన 12 మందికి పద్మ అవార్డులు దక్కాయి. ఆధ్యాత్మిక రంగంలో చినజీయర్ స్వామి, కమలేష్ డి పటేల్‌లకు పద్మభూషణ్ లభించింది. కీరవాణితో పాటు ఏపీ నుంచి ఏడుగురు, తెలంగాణ నుంచి ముగ్గురు పద్మశ్రీ అవార్డులు అందుకున్నారు.
PPF Scheme: నెలకు రూ.5వేలు పెడితే రూ.42లక్షలు పొందే గోల్డెన్ ఛాన్స్