Tragedy: అక్రమ నిర్మాణాలు అదుపు తప్పాయి. అక్రమార్కులను అడ్డుకునే వారు లేరు. ఏ వీధిలో చూసినా రోడ్లను ఆక్రమించి.. సెల్లార్లను పార్కింగ్ కు వదలకుండా.. బాల్కనీలు పెంచి బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నారు. ఒక దానికి అనుమతులు తీసుకుంటున్నారు. మరో విధంగా నిర్మాణం జరుగుతోంది. అయితే ఈ భవనాల వల్ల కొందరి జీవితాలు అధ్వానంగా మారుతున్నాయి. నగరంలోని బోరబండ పరిధిలోని రహమత్‌నగర్‌లో విషాదం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి నిర్మాణంలో ఉన్న ఓ భవనం గోడ కూలిపోయింది. దీంతో పక్కనే ఉన్న ఇంటిపై ఇటుకలు పడ్డాయి. దీంతో ఆ ఇంట్లో ఉన్న నెల పాప మృతి చెందింది.
Read also: Robbers: బాసరలో దోపిడీ దొంగల హల్చల్..
నారాయణఖేడ్‌కు చెందిన శ్రీకాంత్-జగదేవి దంపతులు.. కూలీ పనుల నిమిత్తం నగరానికి వచ్చి రహమత్‌నగర్ పరిధిలోని ఓమ్‌నగర్‌లో నివాసం ఉంటున్నారు. మంగళవారం రాత్రి భారీ వర్షం కురవడంతో వారు నివాసముంటున్న పక్కనే నిర్మాణంలో ఉన్న భవనంలోని నాలుగో అంతస్తులోని సైడ్ వాల్ కూలిపోయింది. దీంతో ఇటుకలు శ్రీకాంత్ ఉంటున్న రేకుల గదిపై పడ్డాయి. పెద్ద శబ్ధం రావడంతో ఏంజరుగుతుందో తెలుసుకునేందుకు భార్యాభర్తలిద్దరూ బయటకు పరుగులు పెట్టారు. కాగా 8నెలల జీవనిక అనే చిన్నారి లోపల నిద్రిస్తుండటం గమనించలేక పోయారు. ఆ సమయంలో నిద్రిస్తున్న దంపతులు ప్రక్కనే పడుకున్న చిన్నారిపై పడ్డాయి. దీంతో ఆ చిన్నారి తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది. చిన్నారికోసం లోపలికి పరిగెత్తిన తల్లిదండ్రులకు నిరాసే మిగిలింది. అప్పటికే ఆ చిన్నారి మృత్యు ఓడికి జారింది. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. చిన్నారి మృతికి కారకులైన వారిపై కఠినంగా శిక్షించాలని కోరారు. అక్కడ అక్రమంగా భవన నిర్మాణం జరుగుతోందని తల్లిదండ్రులు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మరోవైపు చిన్నారి మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలించిన పోలీసులు ఘటనపై విచారణ ప్రారంభించారు. బిల్డింగ్ ఎవరిది? ఇల్లమధ్యంలో అక్రమంగా ఎవరు నిర్మాణం చేపట్టారు అనే దానిపై ఆరాతీస్తున్నారు.