DG Charu Sinha: మహిళల భద్రత అనేది కేవలం పోలీసుల బాధ్యత మాత్రమే కాదని, సమాజంలోని ప్రతి ఒక్కరూ దీన్ని సామూహిక బాధ్యతగా గుర్తించాలని మహిళా భద్రతా విభాగం డీజీ చారు సిన్హా స్పష్టం చేశారు. సమాజంలో ఎక్కడైనా వేధింపులు, లింగ వివక్ష వంటి అనుచిత ప్రవర్తనలు ఎదురైతే వాటిని చూసీచూడనట్లు వదిలేయకుండా, ధైర్యంగా నిలదీసే అలవాటును యువత పెంపొందించుకోవాలని ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణ పోలీసు మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో ‘స్టాండ్ విత్ హర్’ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో రెండు రోజుల ‘ట్రైనర్ల శిక్షణ’ (టీవోటీ) కార్యక్రమం గురువారం ఘనంగా ప్రారంభమైంది. ఈ సదస్సుకు ఉస్మానియా విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కుమార్ మొలుగారం, డీజీ చారు సిన్హా, శిక్షణ విభాగం అధిపతి ఆసియా షెర్వాణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా పలు డిగ్రీ కళాశాలల నుంచి పెద్ద సంఖ్యలో అధ్యాపకులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డీజీ చారు సిన్హా మాట్లాడుతూ.. మహిళల రక్షణకు కేవలం కఠిన చట్టాలు తీసుకువస్తే సరిపోదని, ప్రజల ఆలోచనా విధానంలో, సామాజిక దృక్పథంలో ప్రాథమిక మార్పు రావాలని ఉద్ఘాటించారు. “యువత మహిళల పట్ల పూర్తి గౌరవంతో మెలగాలి. లింగ వివక్ష, వేధింపులను ప్రోత్సహించే ధోరణులను తీవ్రంగా వ్యతిరేకించాలి. పరస్పర గౌరవం, సమ్మతి (కన్సెంట్), వ్యక్తిగత సరిహద్దులను గుర్తించడం, సమానత్వం వంటి విలువలపై యువతలో లోతైన అవగాహన అవసరం” అని ఆమె పేర్కొన్నారు. యూనివర్సిటీ ఉపకులపతి కుమార్ మొలుగారం మాట్లాడుతూ.. విద్యాసంస్థల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తూ, భయం లేని సురక్షిత వాతావరణాన్ని అందించడానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఉస్మానియా విశ్వవిద్యాలయంలో సుమారు 40 శాతం మంది మహిళా అధ్యాపకులే ఉన్నారని ఆయన గుర్తుచేశారు. క్యాంపస్‌లో దాదాపు 1,500 మంది విద్యార్థినులు బస చేసేందుకు వీలుగా సకల వసతులతో ప్రత్యేక బహుళ అంతస్తుల వసతి గృహాల నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నట్లు వెల్లడించారు.
అక్టోబర్ 30 వరకు కొనసాగే ఈ ప్రత్యేక శిక్షణలో నాలుగు బ్యాచ్‌లుగా విభజించి, మొత్తం 250 మందికి పైగా విద్యార్థులు, అధ్యాపకులకు శిక్షణ ఇస్తున్నారు. ఈ శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్లు తమ తమ కళాశాలలకు వెళ్లి ఇతర విద్యార్థులకు అవగాహన తరగతులు నిర్వహిస్తారు. తద్వారా రాబోయే ఆరు నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 2,000 మందికి పైగా యువతను చైతన్యవంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ శిబిరంలో సమస్యలను చురుగ్గా వినడం, ఇతరుల భావాలను అర్థం చేసుకోవడం (ఎంపతీ), ప్రభావవంతమైన కమ్యూనికేషన్, క్లిష్టమైన సామాజిక అంశాలపై నిర్మాణాత్మక చర్చలు నడపడం వంటి కీలక నైపుణ్యాలను నేర్పిస్తున్నారు. మహిళా గౌరవం, సమానత్వం, భద్రతపై అవగాహనను ఆచరణలోకి తెస్తూ సురక్షిత సమాజాన్ని నిర్మించడమే ‘స్టాండ్ విత్ హర్’ ముఖ్యోద్దేశమని అధికారులు వివరించారు.

