దేశంలో ఎక్కువ జనాభా ఉన్న 18-59 మధ్య వయస్సు వారికి బూస్టర్ ఇవ్వడంలో ఇంకా క్లారిటీ రాలేదు. కేవలం 12 ఏండ్లలోపు, 60 ఏండ్లు పైబడినవారికే టీకా వేసేందుకు అనుమతి ఇస్తున్నది. అనేక రాష్ట్రాల్లో టీకా నిల్వలు పేరుకుపోయినప్పటికీ 18+కు బూస్టర్‌పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
ప్రస్తుతం రాష్ట్రంలో మిగిలిపోయిన 32 లక్షల డోసులను ప్రభుత్వం ఆధ్వర్యంలో 18-59 ఏండ్ల మధ్యవారికి బూస్టర్ డోస్ వేయడానికి అనుమతి ఇవ్వాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ ను రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు కోరారు. ప్రస్తుతం అనేక రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని, రాష్ట్రాల్లో నిల్వ ఉన్న కోవిడ్ టీకాల కాల పరిమితి ముగుస్తున్న నేపథ్యంలో వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు.
బూస్టర్ డోస్‌కు అనుమతివ్వాలంటూ హరీశ్‌రావు గతంలోనూ కేంద్రానికి రెండు సార్లు లేఖ రాసిన సంగతి తెలిసిందే. నిక్షయ్ మిత్ర క్యాంపెయిన్, రాష్ట్రీయ నేత్ర జ్యోతి అభియాన్, హర్ ఘర్ దస్తక్ క్యాంపెయిన్ -2.0పై కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ సోమవారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల వైద్యారోగ్యశాఖ మంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
హైదరాబాద్ వెంగళరావునగర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయం నుంచి మంత్రి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అమలవుతున్న టీబీ నిర్మూలన, కంటి పరీక్షలు, కరోనా వాక్సినేషన్ గురించి వివరించారు. కేంద్ర ప్రభుత్వానికి పలు విజ్ఞప్తులు, సూచనలు చేశారు. ప్రస్తుతం 60 ఏండ్లకుపైబడిన వారికి మాత్రమే ప్రభుత్వం ఉచితంగా ప్రికాషనరీ డోస్ ఇచ్చేందుకు కేంద్రం అనుమతించిందని, 18-59 ఏండ్ల వయస్కులకు ప్రైవేట్ దవాఖానల్లో బూస్టర్ డోస్ వేస్తున్నారని చెప్పారు. రాష్ట్రంలో 32 లక్షల వాక్సిన్ డోసులు నిల్వ ఉన్నాయని, వాటి గడువు తేదీ ముగియకముందే ప్రికాషనరీ డోస్ వేసేందుకు అనుమతివ్వాలని కోరారు.
రాష్ట్రంలో వాక్సినేషన్ వేగంగా జరుగుతున్నదని మంత్రి హరీశ్‌రావు వివరించారు. ఈ నెల 3 నుంచి ప్రారంభమైన ఇంటింటికీ వ్యాక్సినేషన్‌లో భాగంగా పదిరోజుల్లో 1.30 లక్షల మందికి టీకాలు వేసినట్టు తెలిపారు. రాష్ట్రంలో 12 ఏండ్లకు పైబడినవారికి మొదటి డోసు 104.78%, రెండో డోసు 99.72% పంపిణీ చేసినట్టు పేరొన్నారు.
కరోనా వ్యాప్తిని గమనిస్తూ నిర్ధారణ పరీక్షలు పెంచుతున్నట్టు తెలిపారు. టీబీ నిర్మూలనకు కేంద్రం అమలుచేస్తున్న నిక్షయ్ మిత్రను రాష్ట్రంలో విజయవంతంగా అమలుచేస్తామని చెప్పారు. కంటి ఆపరేషన్లు మరింత పెంచేలా టీచింగ్ హాస్పిటళ్లు, జిల్లా దవాఖానల్లో పాకో మిషన్లు సమకూర్చి, లక్ష్యం చేరుతామని తెలిపారు. కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, కుటుంబ, సంక్షేమ విభాగం డైరెక్టర్ శ్వేత మహంతి, సీఎం ఓఎస్డీ గంగాధర్, డీహెచ్ శ్రీనివాసరావు, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
• ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రికాషన్ డోస్ కు అనుమతించండి.
• 32 లక్షల డోసుల నిల్వ ఉంది, గడువు తేదీ ముగిసే అవకాశం ఉంది.
• రాష్ట్రంలో వేగంగా కొనసాగుతున్న కరోనా వ్యాక్సినేషన్.
• ఇంటింటికి వాక్సినేషన్ లో భాగంగా పది రోజుల్లో 1.30 లక్షల మందికి టీకాలు వేసినట్లు వెల్లడి. pic.twitter.com/6uUTYeDIem— Harish Rao News (@TrsHarishNews) June 13, 2022
