సందట్లో సడేమియా అంటాం. మనం ఒక పనిలో బిజీగా వుంటే.. దొంగలు తమ పని కానిచ్చేస్తారు. వినాయకచవితి పండుగ నాడు కొందరికి వింత అనుభవం ఎదురైంది. పండుగ సరదాలో వుంటే దొంగలు తమ చేతికి పని చెప్పేశారు. ఈనెల 9వ తేదీన వినాయక నిమజ్జనం అంగరంగ వైభవంగా సాగింది. పోలీసులు, వివిధ శాఖల సమన్వయంతో నిమజ్జనాలు ప్రశాంతంగా సాగాయి. ఎవరి ఎంజాయ్‌మెంట్‌లో వాళ్లుంటే దొంగలు మాత్రం సెల్ ఫోన్లు దొంగిలించేశారు. వినాయక చవితి మొదలు నిమజ్జనం వరకు వేలాదిమంది సెల్ ఫోన్లు పోగొట్టుకున్నారు.
Read Also: Harish Rao : ట్రైబల్ యూనివర్సిటీ అతీగతీ లేదు.. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ అడ్రస్ లేకుండా పోయింది
నిమజ్జనం నాడు ఒక్కరోజే హైదరాబాద్ లో 1500 వరకూ సెల్ ఫోన్లు పోయాయని తెలుస్తోంది. ఈ సెల్ ఫోన్ల విలువ 5వేల రూపాయల నుంచి లక్ష వరకూ వుంది. కొన్ని సెల్ ఫోన్లయితే లక్షన్నర వరకూ విలువ చేస్తాయి వేటినీ వదలకుండా.. తమ చేతివాటం ప్రదర్శించారు దొంగలు. మహా గణపతి ఊరేగింపును చూసేందుకు లక్షలాది మంది భక్తులు హాజరవడం దొంగలకు బాగా కలిసి వచ్చింది. జేబు దొంగలు భక్తుల పాకెట్లలో, ఆడవారి హ్యాండ్ బ్యాగ్ లలో వున్న ఖరీదైన ఫోన్లు కొట్టేశారు.
వేలాది మంది తమ సెల్‌ఫోన్లు చోరీకి గురైనట్లు ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో ఫిర్యాదులు చేశారు. హైదరాబాద్ రద్దీ ప్రాంతాల్లో సెల్‌ఫోన్ చోరీ చేసే కొన్ని ముఠాలను ఇప్పటికే పోలీసులు గుర్తించారు. కొందరు ముఠాలు ఏర్పడి ఇలా చోరీకి పాల్పడుతున్నారని పోలీసులు చెబుతున్నారు. గతంలో జరిగిన బోనాల వేడుకల్లో సికింద్రాబాద్ మహంకాళి ఆలయంలో వందకు పైగా సెల్ ఫోన్లను దొంగిలించారు. వినాయక నిమజ్జన సమయంలోనూ ఇదే ముఠాలు తమ చేతికి పని చెప్పాయని, వారిని పట్టుకుంటే మొత్తం గుట్టు రట్టవుతుందని పోలీసులు అంటున్నారు. IMEI నెంబర్ ఆధారంగా దొంగతనానికి గురైన ఫోన్లను పోలీసులు ట్రేస్ చేసే పనిలో వున్నారు. ఏపీలోనూ సెల్ ఫోన్ దొంగలు భారీగానే కాజేశారు.
Read Also: Ponniyan Selvan: ‘రాచ్చస మావయ్య’ గా మారిన కార్తీ.. చచ్చు బుద్ది మారదంటూ శోభిత ఆగ్రహం
