ఓ హార్స్ రైడింగ్ క్లబ్ లో అనుమతి లేకుండా పుట్టిన రోజు వేడుకలు జరుగుతుండడంతో ఎస్‌వోటీ పోలీసులు దాడి చేశారు. ఈ దాడిలో మద్యం, గంజాయి మత్తులో యువతీ యువకులు పట్టుబడ్డ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. ఎస్‌వోటీ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ గ్రామ సమీపంలోని ఓ హర్స్ రైడింగ్ క్లబ్‌లో ఎలాంటి అనుమతులు లేకుండా బుధవారం అర్థరాత్రి పుట్టినరోజు వేడుకలు జరుగుతున్నాయి.
ఈ విషయంపై సమాచారం అందడంతో ఎస్‌వోటీ పోలీసులు దాడి చేశారు. దీంతో మద్యం, గంజాయి మత్తులో తూగుతూ యువతీయువకులు పట్టుబడ్డారు. సంఘటన స్థలంలో గంజాయి కూడా లభ్యమవడంతో పోలీసులు అందరినీ అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.