Site icon NTV Telugu

Stephen Raveendra: నవంబర్‌ 3 నుంచి అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ.. పోలీసులు ప్రత్యేక దృష్టి

Stephen Ravindra

Stephen Ravindra

Stephen Raveendra: అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 3 నుంచి అభ్యర్థుల నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో పోలీసులు బందోబస్తుపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇందులో భాగంగా నామినేషన్ కేంద్రాల చుట్టూ నాలుగు అంచెల భద్రతను ఏర్పాటు చేస్తామని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని జోన్ల డీసీపీలతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో సీపీ పాల్గొని పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రతి నామినేషన్‌ కేంద్రం వద్ద నాలుగు అంచెల బందోబస్తు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అభ్యర్థులు, వారి అనుచరులు అధిక సంఖ్యలో నామినేషన్‌ కేంద్రాలకు వచ్చే అవకాశం ఉన్నందున సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్‌ మళ్లింపు చర్యలు చేపట్టాలని ట్రాఫిక్‌ పోలీసు అధికారులకు సూచించారు.

ర్యాలీలు, సభలు, సమావేశాలకు అనుమతులు ఇచ్చే విషయంలో ఆర్‌ఓలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. భారత ఎన్నికల సంఘం జారీ చేసిన మార్గదర్శకాలను పకడ్బందీగా అమలు చేయాలని, ఇందులో భాగంగా ఓటర్లను మోసగించే డబ్బు, మద్యం, ఇతర వస్తువుల రవాణాను నిరోధించే విధంగా వాహన తనిఖీలు నిర్వహించాలన్నారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్న ప్రాంతాల్లో కేంద్ర బలగాల సహాయం తీసుకోవాలన్నారు. ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. సైబరాబాద్ అడిషనల్ సీపీ అవినాష్ మహంతి, జాయింట్ సీపీ (ట్రాఫిక్) కె.నారాయణ్ నాయక్, బాలానగర్ డీసీపీ శ్రీనివాస్ రావు, శంషాబాద్ డీసీపీ నారాయణరెడ్డి, మేడ్చల్ డీసీపీ శబరీష్, మాదాపూర్ డీసీపీ సందీప్, రాజేంద్రనగర్ జోన్ డీసీపీ జగదీశ్వర్ రెడ్డి, ఎలక్షన్ సెల్ డీసీపీ అశోక్ కుమార్ తో పాటు ఏసీపీలు ఉన్నారు. పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Telangana Rains: రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం.. వాతావరణ శాఖ వెల్లడి

Exit mobile version