NTV Telugu Site icon

Builder Murder: పాము కాటుతో భర్త హత్య.. చేయించింది కట్టుకున్న భార్యే

Bilder Murder

Bilder Murder

Builder Murder: పెద్దపల్లి జిల్లా గోదావరిఖని మార్కండేయ కాలనీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి, బిల్డర్ కొచ్చెర ప్రవీణ్ ఈ నెల 9న అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన విషయం తెలిసిందే. గుండెపోటుతో మృతి చెందాడని భార్య చెప్పడంతో.. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతడిది గుండెపోటు కాదని, భార్యే ప్లాన్ వేసి హత్య చేయించిందని పోలీసులు గుర్తించారు. ఈ మేరకు ప్రవీణ్ భార్య సహా ఆమెకు సహకరించిన ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పెద్దపల్లిలో ప్రవీణ్, లలిత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అయితే కొన్నాళ్లుగా ప్రవీణ్‌కు ఓ మహిళతో వివాహేతర సంబంధం ఉంది. ఈ విషయం తెలుసుకున్న భార్య లలిత నిత్యం భర్తతో గొడవ పడుతుండేది. భర్తలో మార్పు రాకపోవడంతో అతడిని హత్య చేయాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ప్రవీణ్ స్థలంలో సెంట్రింగ్ పనులు చేస్తున్న రామగుండం హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన మచ్చ సురేష్ కు లలిత చెప్పింది. ఆమె తన భర్తను చంపితే అతనికి ప్లాట్లు ఇచ్చేందుకు రాజీ కుదుర్చుకున్నారు. హత్యకు అంగీకరించిన సురేష్.. రామగుండుకు చెందిన ఇందారపు సతీష్, మందమర్రికి చెందిన మాసా శ్రీనివాస్, భీమా గణేష్ లతో కలిసి ప్రవీణ్ ను హత్య చేసేందుకు ప్లాన్ సిద్ధం చేశాడు.

మందమర్రిలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డు నన్నపురాజు చంద్రశేఖర్ పాము కాటు ప్లాన్ సహాయం తీసుకున్నాడు. ఈ క్రమంలో లలిత వారి ఖర్చుల కోసం 34 గ్రాముల బంగారు గొలుసును ఇచ్చింది. ఈ నెల 9వ తేదీ రాత్రి రామగుండంలో మద్యం సేవించిన నిందితులు.. లలితతో ఫోన్ లో మాట్లాడి బైక్ పై ఆమె ఇంటికి చేరుకున్నారు. ఇంట్లో పడుకున్న ప్రవీణ్ ని చూపిస్తూ.. లలిత మరో గదిలోకి వెళ్లి వెయిట్ చేసింది. నిందితులు ప్రవీణ్ ముఖాన్ని దిండుతో కప్పి ఊపిరి ఆడకుండా చేశారు. ఆ తర్వాత తమ వెంట తెచ్చుకున్న పాము కాటు వేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రవీణ్ గుండెపోటుతో చనిపోయాడని లలిత చెప్పిన మాటలు మృతురాలి తల్లి నమ్మలేదు. కొడుకు మృతిపై అనుమానం వ్యక్తం చేసింది. పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణలో హత్య పథకం బయటపడడంతో అతడి భార్య లలిత సహా ఆరుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
Amaravati Assigned Land Case: అమరావతి అసైన్డ్ భూముల కేసులో కొత్త ట్విస్ట్.. సీఐడీకి సరికొత్త ఆధారాలు..!