NTV Telugu Site icon

KCR: నేడు సంగారెడ్డిలో కేసీఆర్ పర్యటన.. లక్షల మందితో బహిరంగ సభ

Kcr

Kcr

KCR: నేడు సంగారెడ్డి జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటించనున్నారు. సుల్తాన్ పూర్ లో జరిగే ప్రజా ఆశీర్వాద సభకు లక్ష మందికి పైగా హాజరవుతారనే అంచనాతో బీఆర్ ఎస్ నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు. మెదక్, జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలోని ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి జన సమీకరణపై ప్రత్యేక దృష్టి సారించారు. సుల్తాన్ పూర్ లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.

కేసీఆర్ ప్రసంగం నేపథ్యంలో భారీ వేదికను సిద్ధం చేశారు. ఇవాళ సాయంత్రం 5.30 గంటలకు కేసీఆర్ ప్రజా ఆశీర్వాద బహిరంగ సభ ప్రారంభం కానుంది. హైదరాబాద్ నుంచి పటాన్ చెరు, సంగారెడ్డి మీదుగా రోడ్డు మార్గంలో కేసీఆర్ సుల్తాన్ పూర్ చేరుకుంటారు. కేసీఆర్‌కు స్వాగతం పలికేందుకు బీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రధాన రహదారులు, కూడళ్లలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి గులాబీ జెండాలతో అలంకరించారు. బహిరంగ సభ ప్రాంతంలో కేసీఆర్‌తో పాటు హరీష్ రావు, మెదక్, జహీరాబాద్ ఎంపీ అభ్యర్థులు వెంకట్రామిరెడ్డి, గాలి అనిల్‌కుమార్‌ల కటౌట్‌లను ఏర్పాటు చేశారు.

Read also: Salmankhan : సల్మాన్ ఇంటి బయట కాల్పులు జరిపిన నిందితులు అరెస్ట్.. గుజరాత్లో పట్టుకున్న పోలీసులు

మెదక్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని సంగారెడ్డి, పటాన్‌చెరు, నర్సాపూర్, జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని జహీరాబాద్, అందోలు, నారాయణఖేడ్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. సభ జరిగే స్థలాన్ని పార్టీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికరణ్‌తో కలిసి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు పరిశీలించారు. సభ ఏర్పాట్లపై వారికి పలు సూచనలు చేశారు.

అనంతరం చింతా ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ.. బహిరంగ సభ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు వస్తున్న కేసీఆర్ కు ఘనస్వాగతం పలుకుతామన్నారు. ఈ సమావేశంలో హరీశ్‌రావుతోపాటు మెదక్‌, జహీరాబాద్‌ ఎంపీ అభ్యర్థులు వెంకట్రామిరెడ్డి, గాలి అనిల్‌కుమార్‌, పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, రాష్ట్ర నాయకులు పాల్గొంటారు.
Pushpa 2 : నేటి నుంచి థియేటర్స్ లోకి వచ్చేస్తున్న పుష్ప 2 టీజర్..!!