Site icon NTV Telugu

BRS MLAs: రేపు బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితా ప్రకటన..! కవితతో ఆ ఇద్దరు నేతలు భేటీ..?

Mlc Kavitha

Mlc Kavitha

BRS MLAs: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో ఉప్పల్‌ ఎమ్మెల్యే బి.సుభాష్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఆదివారం భేటీ అయ్యారు. ఉప్పల్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేకు ఈసారి బీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ దక్కదని ప్రచారం జరుగుతోంది. ఉప్పల్ అసెంబ్లీ స్థానం నుంచి మాజీ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పేరును బీఆర్‌ఎస్ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో కవితతో భేతి సుభాష్ రెడ్డి, బొంతు రామ్మోహన్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ బొంతు రామ్‌మోహన్‌రావు ఉప్పల్‌ నియోజకవర్గం ఎమ్మెల్యే టికెట్‌ ఆశిస్తున్నారు. రామ్మోహన్ గత కొంత కాలంగా ఉప్పల్ లో పోటీకి సిద్ధమవుతున్నారు. ఉప్పల్ సిట్టింగ్ ఎమ్మెల్యే భేతి సుభాష్ రెడ్డిని మారుస్తున్నట్లు సమాచారం. మాజీ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డిని రంగంలోకి దింపుతారని అంటున్నారు.

Read also: DNA Test: డీఎన్‌ఏ టెస్ట్ చేయించుకున్న బాయ్ ఫ్రెండ్.. బట్టబయలైన సీక్రెట్

మరోవైపు ఈ ప్రచారం నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో భేతి సుభాష్ రెడ్డి, బొంతు రామ్మోహన్ రావు భేటీ కావడం చర్చకు దారి తీసింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ రేపు అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. ఈ తరుణంలో కవితతో ఈ ఇద్దరు నేతలు భేటీ కావడంపై రాజకీయంగా రకరకాల చర్చలు జరుగుతున్నాయి. ఉప్పల్ నియోజకవర్గంలోని పరిస్థితిని ఈ ఇద్దరూ కవితకు వివరించినట్లు సమాచారం. వీరిలో ఒకరికి టిక్కెట్ ఇవ్వాలని కూడా కవితను కోరినట్లు సమాచారం. ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లాలని కవితను కోరినట్లు ఇద్దరు నేతలు చెబుతున్నారు. ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు సర్వేలు, సామాజిక సమీకరణాల ఆధారంగా అభ్యర్థులను ప్రకటించేందుకు బీఆర్ఎస్ నాయకత్వం ప్రయత్నిస్తోంది.
Telangana Congress: ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్.. 26న చేవెళ్ల సభలో వైఖరి తేల్చనున్న కాంగ్రెస్

Exit mobile version