Murder : మానవ సంబంధాలు మంటగలుస్తున్నాయి. తొడబుట్టిన వాళ్లనే కాటికి పంపుతున్నారు కొందరు దుర్మార్గులు. మెదక్ జిల్లాలో చేతబడులు చేస్తున్నాడని అనుమానంతో సొంత అన్ననే కిరాతకంగా హత్య చేశాడు తమ్ముడు. కసి తీరా పీక కోసి కూల్ అయ్యాడు. ఈ ఫోటోలో కనిపిస్తున్న ఇద్దరు వ్యక్తుల పేర్లు మంక్త్యా నాయక్, మోహన్ నాయక్. ఇద్దరు సొంత అన్నదమ్ములు.. సీన్ కట్ చేస్తే ఇగో ఇలా అన్న.. మంక్త్యా నాయక్ని తమ్ముడు మోహన్ అతి కిరాతకంగా బాండ రాళ్లతో మోది.. కల్లు సీసాలతో పొడిచి హత్య చేశాడు. కసి తీరా పీక కోశాడు. రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్నా వదలకుండా తన వద్ద ఉన్న టవల్‌తో మెడ చుట్టూ ఉరివేసి చంపాడు…
మెదక్ జిల్లా కొల్చారం మండలం అంసానిపల్లి పరిధి వస్రాం తండాకు చెందిన ఇద్దరు అన్నదమ్ముళ్లకు గత కొంతకాలంగా ఆస్తి తగాదాలు ఉన్నాయి. అలాగే ఈ మధ్యే మోహన్ నాయక్ మనవరాలు అనారోగ్యంతో చనిపోయింది. ఇంట్లో సమస్యల కారణంతో ఓ తాంత్రికుడి దగ్గరికి వెళ్తే మీ అన్నే మనవరాలు మృతికి కారణం అని చెప్పాడు. దీంతో అన్న మంక్త్యాపై మోహన్ కక్ష పెంచుకున్నాడు. ఎలాగైనా అన్నని చంపాలని నెల రోజులుగా పగతో రగిలిపోతున్నాడు మోహన్.
ఈ క్రమంలో ఇద్దరూ తండాలోని కల్లు డిపో వద్ద కల్లు తాగడానికి వచ్చారు. అన్నని చూసి ఆగ్రహంతో రగిలిపోయాడు తమ్ముడు. ఇద్దరి మధ్య చిన్నగా గొడవ మొదలైంది. గొడవ కాస్త చినికి గాలివానలా మారింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్నారు. తమ్ముడు మోహన్ అక్కడే ఉన్న బండరాళ్లతో తలపై కొట్టి…కల్లు సీసాలతో మంక్త్యా కడుపులో పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో అక్కడికక్కడే మంక్త్యా కుప్పకూలాడు. అయినా మోహన్ ఇంకా అన్నని కొడుతూనే ఉన్నాడు. ఈ ఘటన అంతా అక్కడున్న వారు వీడియో తీస్తున్నారు తప్ప ఎవ్వరు కూడా అడ్డుకునే యత్నం చేయలేదు.
హత్య సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడు మోహన్‌ని అదుపులోకి తీసుకున్నారు. మంక్త్యా మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మెదక్ జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు మార్చురీ వద్దకు చేరుకుని బోరున విలపించారు. తమ్ముడే కాల యముడిలా మారుతాడని కలలో కూడా అనుకోలేదని మృతుడి భార్య రోదించిన తీరు అందరిని కన్నీరు పెట్టించింది..
మరోవైపు మృతదేహానికి పోస్టుమార్టం చేసే సమయంలో మార్చురీ వద్ద కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మంక్త్యాని హత్య చేసిన మోహన్‌ని తమకి అప్పగించాలని మృతుడి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ సమయంలో మృతుడి కుటుంబ సభ్యులు, మోహన్ కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణ పడ్డారు. పోలీసులు వారికి నచ్చజెప్పే యత్నం చేసినా పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో లాఠీలకు పని చెప్పారు. కుటుంబ సభ్యులు మంక్త్యా మృత్జాదేహానికి పోస్టుమార్టం నిర్వహించడానికి ఒప్పుకోలేదు. ఎట్టకేలకు పోలీసులు వారికి నచ్చజెప్పి మధ్య పోస్టుమార్టం నిర్వహించేందుకు ఒప్పించారు.. మొత్తంగా ఈ సంఘటన మెదక్ జిల్లాలో సంచలనం సృష్టించింది. మంత్రాలకు చింతకాయలు రాలవు అనే నానుడి ఉన్నా కొందరు మూఢ నమ్మకాల్లో పడి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు…
