Site icon NTV Telugu

Brave Incident: వాగులో చిక్కుకున్న కూలీలు… కాపాడిన యువకులు.

Water Flow

Water Flow

Brave Incident: కాల్వ శ్రీరాంపూర్ మండలం జొన్నల మల్యాల సమీపంలోని నక్కల వాగులో కూలీలు చిక్కుకున్నారు. మల్యాల నుండి పోచంపల్లి వెళ్లే దారిలో నక్కల వాగు అవతలి ఒడ్డు వైపు ఉన్న రైతుల పొలాల్లో ఉదయం వరి నాట్ల కోసం పెద్దపల్లి మండలం గౌరెడ్డి పేట గ్రామం నుండి 15 మంది కూలీలు రావడం జరిగింది. ఉదయం వర్షం అంతంతమాత్రంగా ఉండడంతో అవతలి వైపుకు దాటిన కూలీలందరూ పని ముగించుకుని తిరిగి వచ్చే క్రమంలో మధ్యాహ్నం కురిసిన కొండపోత వర్షానికి నక్కల వాగు ఉధృతం అయి అందులో చిక్కుబడిపోయారు. వెంటనే విషయం తెలుసుకున్న మల్యాల గ్రామానికి చెందిన కొందరు యువకులు తాళ్ల సహాయంతో కూలీల అందరిని క్షేమంగా బయటికి తీసుకొచ్చారు.

Anger Effects: కోపం వల్ల ఎన్ని జబ్బులు వస్తాయో తెలుసా..? లిస్ట్ ఇదే..

వాగు దాటే క్రమంలో ఇద్దరు మహిళలు ప్రాణాపాయ స్థితి నుండి బయటపడ్డారు. కూలీ కోసం వస్తే ప్రాణాల మీదికి వచ్చిందంటూ ఒడ్డుకు చేరుకున్న మహిళలు ఊపిరి పీల్చుకుని ఆవేదనతో చెప్పారు. మల్యాల గ్రామానికి చెందిన వేల్పుల సంపత్, రాపర్తి వేణు, రాపర్తి మల్లయ్య, శీలం సుధాకర్ రెడ్డి, శీలం ప్రభాకర్ రెడ్డి లెక్కల వేణుగోపాల్ రెడ్డి, వేల్పుల కల్పన, మూడెత్తుల సదయ్య, ఆకుల ప్రమీల, ఇందుర్తి సదయ్య, బొడ్డు రాజయ్య, గడ్డం రమేష్, పడాల కుమారస్వామి, మూడెత్తుల శంకరయ్య, ఇందుర్తి నాగరాజు లు ధైర్యంగా వాగులోకి దిగి తాల సహాయంతో వారందరినీ కాపాడారు.

ఎన్నికల సమయంలో స్థానిక ఎమ్మెల్యే విజయ రమణారావు ఇచ్చిన వాగ్దానం ప్రకారం వెంటనే నక్కల వాగుపై బ్రిడ్జిని నిర్మించి తమ కష్టాలను తీర్చాలని మల్యాల గ్రామస్తులు కోరుతున్నారు. గత రెండు సంవత్సరాలుగా ఎన్నిసార్లు విన్నవించినా కూడా ఎవరూ పట్టించుకోవడంలేదని.. నిత్యం వాగు దాటి వ్యవసాయ పనులు చూసుకోవడానికి అవతలి వైపుకు వెళ్లక తప్పని పరిస్థితులు ఉన్నాయని, ఏ క్షణంలో ఏమవుతుందో తెలియక ప్రాణాలు పోగొట్టుకునే పరిస్థితి వచ్చిందన్నారు.

గతంలో ఈ వాగులో మల్యాల గ్రామానికి చెందిన మామిడి కొమురయ్య ఎడ్ల బండితో సహా కొట్టుకుపోవడం జరిగిందని ఈ ప్రమాదంలో ఎడ్లు చనిపోవడం కూడా జరిగింది. అలాగే మీర్జంపేట గ్రామానికి సెక్రటరీగా పనిచేసిన ఒక ప్రభుత్వ ఉద్యోగి కూడా తన వాహనంతో సహా ఇదే వాగులో కొట్టుకొని పోయి చనిపోయాడు. ఇలా ఇంకెన్ని మరణాలు సంభవిస్తే మా బతుకులు బాగుపడుతాయి అంటూ గ్రామస్తులు ఆవేదనతో చెబుతున్నారు.

Can You Eat Snake Eggs: పాము గుడ్లతో ఆమ్లెట్ వేసుకుని తింటే ఏమౌతుంది..?

Exit mobile version