Bollaram Army Weapons Theft Case : బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీలో ట్విస్ట్.. కీపర్లేదే కీలక పాత్ర.!

  • మాజీ హవల్దార్‌కు కీపర్ల సహకారం
  • లక్షల్లో జరిగిన ఆర్థిక లావాదేవీలు
  • ఇద్దరు కీపర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు
  • మల్లేశ్‌తో సీన్ రీ-కన్‌స్ట్రక్షన్
Bollaram Army Weapons Theft

Bollaram Army Weapons Theft

సికింద్రాబాద్ పరిధిలోని బొల్లారం మద్రాస్ ఆర్మీ రెజిమెంట్‌లో జరిగిన సంచలనాత్మక ఆయుధాల చోరీ కేసులో పోలీసుల దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసు విచారణలో కీలక పురోగతి లభించగా, ప్రధాన నిందితుడైన మాజీ హవల్దార్ మల్లేశ్‌కు ఆర్మీ ఆయుధాగారం (ఆర్మరీ) కీపర్లు పూర్తిస్థాయిలో సహకరించినట్లు పోలీసులు ఆధారాలతో సహా నిర్ధారించారు. ఈ నేరంలో భాగస్వామ్యమున్న ఆయుధాగారం కీపర్లు వినోద్, శేషులను పోలీసులు తక్షణమే అదుపులోకి తీసుకున్నారు.

కీపర్లతో మల్లేశ్ కుమ్మక్కు.. రూ. లక్షల్లో ఆర్థిక లావాదేవీలు

మిలిటరీ క్యాంపులోని ఆయుధాగారం నుంచి తుపాకులు, బుల్లెట్లను దొంగిలించే క్రమంలో మల్లేశ్‌తో కలిసి వినోద్, శేషులు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించినట్లు పోలీసుల విచారణలో స్పష్టమైంది. ఈ చోరీకి సంబంధించి మాజీ హవల్దార్ మల్లేశ్ , ఈ ఇద్దరు కీపర్ల మధ్య భారీ మొత్తంలో ఆర్థిక లావాదేవీలు జరిగినట్లు సాంకేతిక ఆధారాలను (టెక్నికల్ ఎవిడెన్స్) అధికారులు సేకరించారు. ఆయుధాలు చోరీ చేసి బయటకు తరలించినందుకు గానూ వారికి మల్లేశ్ భారీగా నగదు ముట్టజెప్పినట్లు భావిస్తున్నారు.

10 రోజుల పోలీస్ కస్టడీ.. మద్రాస్ రెజిమెంట్‌లో సీన్ రీ-కన్‌స్ట్రక్షన్

ఇప్పటికే మల్లేశ్ నివాసంలో సోదాలు నిర్వహించి, నిబంధనలకు విరుద్ధంగా దాచి ఉంచిన అనేక ఆర్మీ ఆయుధాలను, భారీగా బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం 10 రోజుల పోలీస్ కస్టడీలో ఉన్న మల్లేశ్‌ను పోలీసులు తీవ్రంగా ప్రశ్నిస్తున్నారు. విచారణలో భాగంగా చోరీ ఎలా జరిగింది, ఆయుధాలను ఏ విధంగా బయటకు తెచ్చారనే అంశాలను ప్రత్యక్షంగా నిర్ధారించుకోవడానికి మల్లేశ్‌ను బొల్లారంలోని మద్రాస్ రెజిమెంట్‌కు తీసుకెళ్లి సీన్ రీ-కన్‌స్ట్రక్షన్ నిర్వహించారు. కేసు విచారణ పురోగతిలో ఉండటంతో ఈ ఆయుధాల చోరీకి సంబంధించిన మరిన్ని సంచలన వివరాలు త్వరలోనే వెలుగులోకి వచ్చే అవకాశముంది.