NTV Telugu Site icon

Bandi Sanjay: టీఆర్ఎస్ ఇచ్చే డబ్బులు తీసుకోండి.. బీజేపీకి ఓటెయ్యండి

Bandi Sanjay Munugode

Bandi Sanjay Munugode

BJP Will Definitely Win In Munugode By Elections Says Bandi Sanjay: మునుగోడు ఉప ఎన్నికల కోసం టీఆర్ఎస్ పార్టీ ఇచ్చే డబ్బులు తీసుకొని, తమ బీజేపీకి ఓటు వేయాలని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మునుగోడు ప్రజల్ని కోరారు. గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారని అన్నారు. ఫామ్ హౌస్‌లో పడుకున్న ముఖ్యమంత్రిని.. మర్రిగూడ మండలం లెంకలపల్లికి తీసుకొచ్చిన ఘనత రాజగోపాల్ రెడ్డిది అని పేర్కొన్నారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని.. టీఆర్ఎస్ ఓటమి తథ్యమని జోస్యం పలికారు. చండూరులో నామినేషన్ పత్రాలు సమర్పించేందుకు రాజగోపాల్ రెడ్డితో పాటు బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగానే బండి సంజయ్ పైవిధంగా స్పందించారు.

ఇదే సమయంలో కోమటరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కోసం, కుటుంబ పాలన అంతం కోసం తాను రాజీనామా చేశానని అన్నారు. మునుగోడు ప్రజలు తనని ఆశీర్వదించాలని కోరారు. తాను ఎలాంటి ఆర్థిక లబ్ధి పొందలేదని, ఒకవేళ పొందినట్లు నిరూపిస్తే తాను ఏ శిక్షకైనా సిద్ధమేనని సవాల్ చేశారు. బీజేపీ ద్వారా ద్వారా తనకు ఎలాంటి ఆర్థిక లబ్ది జరగలేదన్నారు. కావాలంటే తాను ఏ గుడిలోనైనా ప్రమాణం చేయడానికి సిద్ధమేనన్నారు. మోడీ, అమిత్ షా ఆధ్వర్యంలో భారతదేశం అభివృద్ధి పథంలో సాగుతోందని.. తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి కోసం మునుగోడులో బిజెపిని గెలిపించాలని పేర్కొన్నారు. అనంతరం కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, కల్వకుంట్ల కుటుంబ అహంకారానికి మధ్య జరుగుతున్న ఉప ఎన్నిక ఇది అని తెలిపారు. రాజగోపాల్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరిన ఆయన.. టిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పడానికి ఈ ఉప ఎన్నికను ప్రజలు వినియోగించుకోవాలన్నారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని మంటకలిపే విధంగా.. కేసీఆర్ తన పార్టీలో తెలంగాణ అనే పదాన్ని తొలగించారన్నారు.

Show comments