NTV Telugu Site icon

Ntv Face to Face with KTR: దేశంలో బీజేపీకి ముఖ్యబలం.. కాంగ్రెస్ బలహీనతే..!!

Ktr 1

Ktr 1

టీఆర్ఎస్ పార్టీ త్వరలోనే జాతీయ రాజకీయాలపై దృష్టి పెడుతుందని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఎన్టీవీ ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూలో ప్రత్యేకంగా ఆయన మాట్లాడుతూ పలు అంశాలపై వివరించారు. తాను 8 ఏళ్ల పాటు తెలంగాణ ఉద్యమంలో పని చేశానని.. తర్వాత 8 ఏళ్ల పాటు ప్రభుత్వంలో ఉన్నానని కేటీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసమే టీఆర్ఎస్ పార్టీ పుట్టిందని.. అందుకే రాష్ట్రం ఆవిర్భవించిన రోజు కలిగిన తృప్తి, సంతోషంతో పోలిస్తే మిగతా విషయాలు సరితూగవన్నారు. ముఖ్యంగా తమ పార్టీకి 2014 ఫేజ్ బెస్ట్ ఫేజ్ అన్నారు.

జాతీయ రాజకీయాల్లో ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ తనదైన ముద్ర వేసిందని.. ఉదాహరణకు రైతు బంధు పథకాన్ని తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టి పీఎం కిసాన్ యోజనగా అమలు చేస్తోందని.. మిషన్ భగీరథ పథకం కూడా విజయవంతం కావడంతో ఆ పథకాన్ని కూడా కాపీ కొట్టి హర్ ఘర్ కో జల్ అనే పథకాన్ని చేపట్టిందని కేటీఆర్ తెలిపారు. దేశంలో ఉన్న 28 రాష్ట్రాల్లో తెలంగాణ ముఖ్యమైన రాష్ట్రం అని.. కొత్తగా ఆవిర్భవించిన రాష్ట్రంలోనే 8 ఏళ్లలో ఎన్నో మంచి పథకాలు ప్రవేశపెట్టినప్పుడు.. మిగతా రాష్ట్రాలలో దేశంలో కేసీఆర్ ఎందుకు మంచి పాలన చేయలేరని ప్రశ్నించారు. ఇప్పటికే జాతీయ రాజకీయాలపై కేసీఆర్ స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారని కేటీఆర్ వివరించారు.

మరోవైపు దేశంలో బీజేపీకి బలం కాంగ్రెస్ పార్టీనే అని మంత్రి కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలహీనతనే బీజేపీ తన బలంగా విశ్వసిస్తోందని అభిప్రాయపడ్డారు. అయితే బలమైన ప్రత్యామ్నాయం ఉన్న చోట్ల బీజేపీ పప్పులు ఉడకటంలేదన్నారు. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీ పార్టీ, పంజాబ్‌లో ఆప్.. బలంగా ఉన్నాయి కాబట్టే అక్కడ బీజేపీ ఓడిపోయిందని కేటీఆర్ తెలిపారు. తెలంగాణలోనూ టీఆర్ఎస్ పార్టీకి బలం ఉండటం వల్లే గత ఎన్నికల్లో 108 స్థానాల్లో తాము గెలిచామని కేటీఆర్ గుర్తు చేశారు.

LIVE : Minister KTR Sensational Interview with NTV | NTV Exclusive