Site icon NTV Telugu

MLA Rajasingh: బీజేపీ లేకుంటే.. కేసీఆర్ సీఎం అయ్యేవారు కాదు

Rajasingh Warns Cm Kcr

Rajasingh Warns Cm Kcr

BJP MLA Rajasingh Warns CM KCR and TRS Leaders: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోసారి సీఎం కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రోజురోజుకి తెలంగాణలో బీజేపీకి పెరుగుతున్న బలం చూసి టీఆర్ఎస్ వెన్నులో వణుకుపుడుతోందన్నారు. ఈటెల రాజేందర్‌తో పాటు ఇతర బీజేపీ నాయకులపై కొందరు టీఆర్ఎస్ నాయకులు ఏవేవో పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఈటెల గురించి మాట్లాడే అర్హత తెరాస నాయకులకు లేదని, హుజురాబాద్‌లో ప్రజలు ఆమోదం తెలియజేసి ఆయన్ను గెలిపించారన్న విషయాన్ని టీఆర్ఎస్ గుర్తు పెట్టుకోవాలన్నారు. తెరాసను వ్యతిరేకించి బయటికి రావడం వల్లే ఈరోజు ఈటెలపై నీతిమాలిన మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. బురద రాజకీయాలు మీరు చేస్తూ.. ఎదుటివారిని విమర్శించడం మీ నైజం అంటూ ఎద్దేవా చేశారు.

తెలంగాణలో కురుస్తోన్న భారీ వర్షాల వెనుక విదేశీ కుట్ర ఉందని, ప్రజల్ని తప్పుదోవ పట్టించడానికి ఈ కుట్ర జరుగుతోందని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చూసి.. సామాన్య మానవుడు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నాడని రాజాసింగ్ సెటైర్లు వేశారు. దేశమంతా బీజేపీ గెలుస్తుందని, తెలంగాణలో కూడా క్షేత్రస్థాయి నుంచి బీజేపీ బలపడుతోందని అన్నారు. బిజెపి ఎదుగుదలని ఓర్వలేకే కల్వకుంట్ల కుటుంబం ఉలిక్కి పడుతోందని.. అందుకే తమ వంది మాగధులతో అవాక్కులు, చవాక్కులు మాట్లాడిస్తున్నారన్నారు. క్లౌడ్ బరస్ట్ గురించి మాట్లాడటానికి రాష్ట్ర గవర్నర్ ఏమైనా శాస్త్రవేత్తనా అని ప్రశ్నించడానికి ముందు.. కెసీఆర్ ఏమైనా శాస్త్రవేత్తనా? అనే ప్రశ్న వేసుకుంటే బాగుంటుందని నిలదీశారు. రాష్ట్రంలో సమస్య ఎక్కడ ఉంటే, అక్కడ గవర్నర్ వెళ్తున్నారన్న విషయాన్ని టీఆర్ఎస్ నాయకులు గుర్తు పెట్టుకుంటే మంచిదని సూచించారు. గౌరవప్రదమైన రాజ్యంగ పదవిలో ఉన్న మహిళా గవర్నర్‌ను గౌరవించడం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు నేర్చుకోవాలని కోరారు.

తెలంగాణ ఉద్యమంలో బీజేపీ కూడా ఉందని, పార్లమెంట్‌లో పెట్టిన బిల్లుకు బీజేపీ సపోర్ట్ చేయడం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్న కనీస జ్ఞానం టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు లేదని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. అసలు బీజేపీ లేకపోయి కేసీఆర్ సీఎం అయ్యుండేవారు కాదన్నారు. అలాగే ఆయన కుటుంబ సభ్యులు మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా కాకుండా ఉండేవారన్న సంగతిని గుర్తంచుకోవాలన్నారు. మీ అందరి పదవులు బీజేపీ పెట్టిన భిక్ష అని మండిపడ్డ రాజాసింగ్.. బీజేపీ నాయకులపై విమర్శలు చేసేముందు జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు.

Exit mobile version