BJP Files Petition In Telangana High Court: మొయినాబాద్ ఫాంహౌస్‌లో ఘటనతో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి బీజేపీ అడ్డంగా దొరికిపోయిందని టీఆర్ఎస్ ఆరోపిస్తుంటే.. ఇదంతా టీఆర్ఎస్ ఆడిన డ్రామా అంటూ బీజేపీ నేతలు రివర్స్ ఎటాక్‌కి దిగారు. ఒకరిపై మరొకరు పరస్పర ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. ఈ ఘటనతో తమకు ఏమాత్రం సంబంధం లేదని బల్లగుద్ది మరీ చెప్తున్న బీజేపీ.. తాజాగా హైకోర్టును ఆశ్రయించింది. ఈ కేసుని సీబీఐకి బదిలీ చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఘటనపై సిట్‌ని నియమించాలని డిమాండ్ చేసింది. ఇదే సమయంలో.. టీఆర్ఎస్ పాలనపై బీజేపీ ఒక చార్జ్‌షీట్ కూడా విడుదల చేసింది.
కాగా.. పార్టీ మారితే డబ్బుతో పాటు కాంట్రాక్టులు, ఉన్నత పదవులు ఇస్తామని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయిన గువ్వల బాలరాజు, రేగా కాంతారావు, హర్షవర్ధన్‌రెడ్డి, రోహిత్‌రెడ్డిలను కొందరు ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నించారు. మొయినాబాద్ ఫాంహౌస్‌లో డీల్ కుదుర్చుకునేలా మాట్లాడుకున్నారు. అయితే.. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో వాళ్లు రంగంలోకి దిగారు. ఈ వ్యవహారంలో రామచంద్రభారతి, సింహయాజి, నంద కుమార్‌లను పోలీసులు అరెస్టు చేశారు. పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. ఈ బేరసారాల వెనుక ఎవరున్నారనే కూపీ లాగేందుకు, ఆ ముగ్గురిని రహస్య ప్రాంతాల్లో ఉంచి విచారిస్తున్నారు. నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న మొబైల్ ఫోన్లను విశ్లేషిస్తున్నారు.
ఇదిలావుండగా.. ఈ ఫాంహౌస్ ఎపిసోడ్ మొత్తం డ్రామా అని బండి సంజయ్, ఈటెల రాజేందర్, రాజగోపాల్ రెడ్డితో పాటు ఇతర నేతలు టీఆర్ఎస్‌పై ఆరోపణలు చేస్తున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో గెలిచేందుకే, ఈ కొత్త డ్రామాను తెరమీదకి తెచ్చారని చెప్తున్నారు. ఈ ఘటనలో అరెస్టైన ముగ్గురు వ్యక్తులతో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని.. వాళ్లకు కేసీఆర్ కుటుంబంతోనే లింకులు ఉన్నాయని పేర్కొంటున్నారు. దీనిపై సీబీఐ విచారణ జరిపించాల్సిందేనని బండి సంజయ్ డిమాండ్ చేస్తున్నారు.
