తెలంగాణలో కరెంట్ ఛార్జీల పెంపుపై ఉద్యమానికి భారతీయ జనతాపార్టీ రెడీ అవుతోంది. ‘ప్రజా బ్యాలెట్’ పేరిట ప్రజాభిప్రాయ సేకరణకు రంగం సిద్ధం చేసింది బీజేపీ. బషీర్ బాగ్ లో రేపు ‘ప్రజా బ్యాలెట్’ ప్రారంభం కానుంది. గ్రామ పంచాయతీ సహా పట్టణాలు, నగరాలుసహా ప్రజాభిప్రాయాన్ని సేకరించేందుకు సిద్ధమైంది బీజేపీ. ధర్నాలు, ఆందోళనలతో ఛార్జీల పెంపును ఉపసంహరించేదాకా టీఆర్ఎస్ పై ఒత్తిడి తేవాలని నిర్ణయించింది.
22 ఏళ్ల కిందట అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రంలో కరెంట్ ఛార్జీలను పెంచడాన్ని నిరసిస్తూ ప్రతిపక్షాలు పెద్ద ఎత్తునకు పిలుపునివ్వడంతో బషీర్ బాగ్ ప్రాంతానికి వేలాది మంది తరలివచ్చారు. అప్పుడు పోలీసులు జరిపిన కాల్పుల్లో పలువురు మరణించిన సంగతి తెలిసిందే. నాటి ఘటనకు సాక్షిగా మారిన బషీర్ బాగ్ ప్రాంతంలోనే కరెంట్ ఛార్జీల పెంపుపై బీజేపీ ప్రజాబ్యాలెట్ పేరిట ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని నిర్ణయించింది.
కరెంట్ ఛార్జీల పేరుతో ప్రజలపై 6 వేల కోట్ల భారాన్ని మోపడాన్ని సమర్ధిస్తారా? సమర్ధించరా? అనే అంశాలపై ఇప్పటికే బ్యాలెట్ పత్రం రూపొందించింది టీ బీజేపీ. బషీర్ బాగ్ ప్రాంతంలో బ్యాలెట్ బాక్సులను ఏర్పాటు చేసి ప్రజలకు బ్యాలెట్ పత్రాలను అందజేసి ప్రజాభిప్రాయాన్ని కోరతామంటున్నారు బీజేపీ నేతలు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ సెంట్రల్, మహంకాళి సికింద్రాబాద్, గోల్కొండ గోషామహల్, భాగ్యనగర్ మలక్ పేట్, మేడ్చల్ అర్బన్, మేడ్చల్ రూరల్, రంగారెడ్డి అర్బన్, రంగారెడ్డి రూరల్ 8 జిల్లాల అధ్యక్షులతోపాటు పలువురు నాయకులు, కార్యకర్తలు ‘ప్రజా బ్యాలెట్’ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఆ తరువాత వచ్చే నెల నుండి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలు, పట్టణాలు, నగరాల్లో ప్రజాబ్యాలెట్ నిర్వహించాలని పార్టీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. అందులో భాగంగా బస్టాండ్ , ప్రభత్వ కార్యాలయాలు… ముఖ్యమైన అన్ని ప్రదేశాల్లో ప్రజా బ్యాలెట్ శిబిరాలను ఏర్పాటుచేయనుంది. ప్రజాభిప్రాయ సేకరణలో వెల్లడైన వివరాలను ఎప్పటికప్పుడు మీడియాకు అందించాలని భావిస్తోంది. దీంతోపాటు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం పూర్తయిన తరువాత కరెంట్ ఛార్జీల పెంపుపై భారీ ఎత్తున పోరాటాలకు బీజేపీ యాక్షన్ ప్లాన్ రూపొందించింది. ఛార్జీల పెంపును ఉపసంహరించే వరకు వివిధ రూపాల్లో ప్రభుత్వంపై ఒత్తిడి తేవడమే లక్ష్యంగా ముందుకు సాగనుంది.
