రాజ్యంగాన్ని అవమాన పరుస్తున్న ముఖ్యమంత్రి తీరుపై మండిపడ్డారు సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగాన్ని రద్దు చేయడం సరికాదన్నారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కులతో భారత దేశంలో వ్యవస్థలు కొనసాగుతున్నాయని ఆ రాజ్యాంగం ప్రకారమే ప్రభుత్వాలు నడుస్తున్నాయని భట్టి విక్రమార్క అన్నారు. రాష్ర్ట శాసనసభ సమావేశాల్లో బడ్జెట్ సందర్బంగా గవర్నర్ మాట్లాడే అంశాన్ని పూర్తిగా రద్దు చేయడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకున్న ఈ నిర్ణయం రాజ్యాంగాన్ని అవమాన పరచడమే అన్నారు.
దేశంలో, రాష్ర్టంలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికి ఆ పార్టీ రాజ్యాంగానికిలోబడి మాత్రమే ప్రభుత్వాలను , అసెంబ్లీ సమావేశాలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. పార్టీలు ముఖ్యం కాదు, వ్యవస్థ ముఖ్యంగా పరిపాలన సాగుతుందని అన్నారు. ప్రపంచదేశాలలో భారత దేశ రాజ్యాంగానికి ఎంతో పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని ఇటువంటి రాజ్యాంగం రాసిన చట్టాలను తుంగతో తొక్కడం సరికాదన్నారు.
రాష్ట్ర శాసనసభలో గవర్నర్ పాత్ర చాలా ముఖ్యమైనదని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించాలన్నారు. శాసనసభ వ్యవహారాల్లో ఇటువంటి పోకడలు మంచివి కావని అన్నారు. ఖమ్మం జిల్లాలో మూడు రోజులుగా భట్టి విక్రమార్క పాదయాత్రలను కొనసాగిస్తున్నారు. పాద యాత్ర సందర్బంగా పలు గ్రామాల్లో వచ్చిన సమస్యలను ఆయన తెలుసుకుంటున్నారు. పీపుల్స్ మార్చ్ పేరుతో ఈ యాత్రలు సాగిస్తున్న భట్టి విక్రమార్క.. మధిర నియోజకవర్గం అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి యాత్రలు సాగిస్తానంటున్నారు.