NTV Telugu Site icon

Bhadradri Mahotsavam: నేటి నుంచి శ్రీరామ నవమి కల్యాణానికి ఆన్లైన్ టికెట్ల విక్రయాలు..

Bhadradri Mahotsavam

Bhadradri Mahotsavam

Bhadradri Mahotsavam: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానము నందు నేటి నుంచి శ్రీరామనవమి తిరు కళ్యాణ నవాహ్నిక ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. నేడు రామాలయంలో వసంతోత్సవం, డోలోత్సవం నిర్వహించనున్నారు. అనంతరం స్వామివారి కల్యాణానికి పసుపు దంచి, ముత్యాల తలంబ్రాలు కలపనున్నారు. నేడు శ్రీరామచంద్రుని పెళ్లి కొడుకుగా అలంకరించనున్నారు. ఇక మరోవైపు శ్రీరామ నవమి కల్యాణానికి ఆన్లైన్ టికెట్ల విక్రయాలు నేటి నుంచి ప్రారంభించారు. శ్రీరామ నవమి సందర్భంగా ఏప్రిల్ 17న భద్రాచలం సీతారామచంద్రస్వామివారి ఆలయంలో కల్యాణోత్సవం నిర్వహించనున్నారు. దీన్ని చూసేందుకు సెక్టార్ టిక్కెట్లు నేటి నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంచనున్నారు. శ్రీరామ నవమి రోజున, ఉభయ దాతల టిక్కెట్టు రుసుము రూ.7,500, ఇద్దరు వ్యక్తులకు ప్రవేశం కల్పించనున్నారు. ఒకరికి రూ.2500, రూ.2000, రూ.1000, రూ.300, రూ.150 టిక్కెట్లు ఇస్తారు. 18న జరిగే పట్టాభిషేక మహోత్సవానికి సంబంధించిన సెక్టార్ టిక్కెట్ల ధరను రూ.1500, రూ.500, రూ.100గా నిర్ణయించారు.

Read also: Holi in Nizamabad: హున్సాలో పిడిగుద్దుల హోలీ.. ఐక్యమత్యంతో ఆట

ఇక మరోవైపు భక్తులు https://bhadradritemple.telangana.gov.in వెబ్‌సైట్‌లో టిక్కెట్లు పొందవచ్చని ఆలయ ఈవో రమాదేవి తెలిపారు. కల్యాణం రోజు నేరుగా రాలేని భక్తులు కూడా పరోక్షంగా తమ గోత్రనామాలతో పూజలు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇందుకోసం రూ.5 వేలు, రూ.1116 టిక్కెట్లను ఇదే వెబ్ సైట్ నుంచి బుక్ చేసుకోవచ్చని తెలిపారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరోవైపు ఆన్‌లైన్‌లో సెక్టార్ టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తులు టిక్కెట్లు తీసుకోవడానికి ఏప్రిల్ 1 నుంచి 17 ఉదయం 6 గంటల వరకు రామాలయ కార్యాలయంలో (తానీషా కల్యాణ మండపం) ఒరిజినల్ ఐడీ కార్డులను సమర్పించాల్సి ఉంటుందని ఈవో వెల్లడించారు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి నేరుగా భద్రాచలం రామమందిరం, తానీషా కల్యాణ మండపం, గోదావరి వంతెన సెంటర్‌లోని ఆలయ విచారణ కేంద్రం, ఆర్డీఓ కార్యాలయాల్లో ప్రత్యేక కౌంటర్లలో టిక్కెట్లను విక్రయించనున్నారు. ఈ విషయాలను భక్తులు గమనించాలని తెలిపారు.
JNUSU Election : ఏబీవీపీకి షాక్.. జేఎన్‎యూ విద్యార్థి సంఘం ఎన్నికల్లో ఎగిరిన లెఫ్ట్ జెండా