Bathukamma 2026: తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవ ప్రతీక, పూల పండుగ బతుకమ్మ ముగింపు వేడుకలకు హైదరాబాద్ మహానగరం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. సద్దుల బతుకమ్మ సంబరాల కోసం చారిత్రక ట్యాంక్‌బండ్ తీరం అద్భుత శోభను సంతరించుకోగా, ఈసారి వేడుకల్లో సరికొత్త గ్లామర్, అంతకుమించిన క్రేజ్ తోడవ్వనుంది. టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇద్దరూ కలిసి ఈ వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలవనుండటం ఇప్పుడు భాగ్యనగరంలో హాట్ టాపిక్‌గా మారింది. తెలంగాణ సాంస్కృతిక వైభవానికి ఆధునిక ఆకర్షణను జోడిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈసారి బతుకమ్మ వేడుకలను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది.
రేపు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్‌బండ్ పరిసరాల్లో జరగనున్న ఈ వేడుకల్లో సినీ తారలు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పాల్గొని సందడి చేయనున్నారు. వెండితెరపైనే కాకుండా బయట కూడా విశేషమైన క్రేజ్ సంపాదించుకున్న ఈ హిట్ కాంబినేషన్, సంప్రదాయ పూల పండుగ వేదికపై ప్రత్యక్షం కానుండటంతో అభిమానుల్లో, నగర పౌరుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. సినిమా తారల రాకతో పాటు వేడుకలను మరింత అద్భుతంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది. హుస్సేన్‌సాగర్ అలల సాక్షిగా రాత్రి వేళ ఆకాశాన్ని మిరుమిట్లు గొలిపేలా ప్రత్యేక లేజర్ షోను ఏర్పాటు చేశారు. మరోవైపు తెలంగాణ మట్టి వాసనను, పల్లె జీవన సౌందర్యాన్ని చాటిచెప్పేలా రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన దాదాపు 700 మంది జానపద కళాకారులు సాంస్కృతిక ప్రదర్శనలతో కదం తొక్కనున్నారు. రంగురంగుల పూల గోపురాలతో తరలివచ్చే మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు సర్వసన్నద్ధమయ్యారు. ఒకవైపు సబ్బండ వర్ణాల పూల సంబరం, మరోవైపు సినీ తారల తళుకులు, ఇంకోవైపు లేజర్ వెలుగుల జిలుగులతో రేపు సాయంత్రం ట్యాంక్‌బండ్ సరికొత్త ఉత్సాహంతో ఊగిపోనుంది.

