Bandi Sanjay Writes Letter To Seek Permission For Kaleshwaram Project Visit: తమ బీజేపీ బృందానికి కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు అనుమతి ఇవ్వాలని కోరుతూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. తమ బృందంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ప్రజా ప్రతినిధులు, ఇరిగేషన్ ఎక్స్‌పర్ట్స్‌తో కలిపి మొత్తం 30 మంది బీజేపీ నాయకులు ఉంటారని ఆ లేఖలో పేర్కొన్నారు. సెప్టెంబర్ మొదటి వారంలో తమ బృందం కాళేశ్వరం ప్రాజెక్ట్‌ని సందర్శిస్తుందని అన్నారు. కాళేశ్వరం ప్రాజక్టు నిర్మాణంతో పాటు వరదలలో మునకపై సమాచారం తెలుసుకోవడం కోసమే తమ బృందం సందర్శనకు వస్తోందని ఆ లేఖలో తెలిపారు.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై తమకున్న అనుమానాల్ని నివృత్తి చేసుకోవాలనుకుంటున్నామని చెప్పారు. భారీ వరదలతో మోటార్లకు ఏర్పడిన నష్ణాన్ని పరిశీలించడమే తమ పర్యటన లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా 1998 వరదలతో శ్రీశైలం టర్బైన్స్ దెబ్బతిన్నప్పుడు, ఆ ప్రాజెక్టును ప్రతిపక్షాలు సందర్శించిన విషయాన్ని గుర్తు చేశారు. 2004 – 2009లో జరిగిన జలయజ్ఞం పనులపై ప్రతిపక్షాలు విమర్శలు ఎక్కుపెట్టినప్పుడు.. వారి అనుమానాల్ని నివృత్తి చేసేందుకు అప్పటి ప్రభుత్వం ప్రతిపక్షాలను పిలిచిందని లేఖలో పేర్కొన్నారు. తమ బృందంతో పాటు ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఇరిగేషన్ అధికారుల్ని పంపించి.. తమ సందేహాల్ని నివృత్తి చేయాల్సిందిగా బండి సంజయ్ డిమాండ్ చేశారు.
