కరీంనగర్ జిల్లా పదాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతూ.. బీజేపీ అత్యంత క్రమశిక్షణ కలిగిన పార్టీ. ఎంతటి సీనియర్ నాయకులైనా సరే…. పార్టీ సిద్దాంతాలు, విధానాలకు లోబడి పనిచేయాల్సిందేనని ఆయన అన్నారు. అంతేకాకుండా కట్టుతప్పితే ఎంతటి వారైనా సరే… సహించే ప్రసక్తే లేదు. వేటు తప్పదు అంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఏ పార్టీలోనైనా కొందరు నిత్య అసమ్మతి వాదులుంటరు. వారు పనిచేయరు. పనిచేసే వాళ్లపై అక్కసు గక్కడమే వారి పని అని ఆయన అన్నారు.
అలాంటి వారి గురించి పట్టించుకోవాల్సిన పనిలేదని, పార్టీ కోసం చిత్తశుద్దితో కృషి చేయాలని ఆయన కార్యకర్తలకు, నాయకులకు పిలుపునిచ్చారు. అధికారంలోకి వచ్చే సమయమిదని, అలాంటి వాళ్ల మాటలు నమ్మి మీరు దారి తప్పితే మీ రాజకీయ భవిష్యత్ దెబ్బతింటదని ఆయన అన్నారు. తెలంగాణలో బీజేపీ పుంజుకుంటున్న సమయంలో ప్రత్యర్థులు ఆడే ఆటలో పడి మోసపోవద్దని ఆయన అన్నారు. అందరం కలసికట్టుగా ఉండి బీజేపీ బలోపేతానికి పనిచేద్దామని ఆయన అన్నారు.