NTV Telugu Site icon

Bandi Sanjay: కేసీఆర్ ఉద్యమమే చేయలేదు.. రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిండు

Bandi Sanjay On Kcr

Bandi Sanjay On Kcr

Bandi Sanjay Sensational Comments On KCR: కేసీఆర్ ఉద్యమమే చేయలేదని, ఎందరో బలిదానాలు చేస్తే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యానించారు. పేదోడు చనిపోతే, పెద్దోడు రాజ్యమేలుతున్నాడని.. ఆత్మబలిదానాలు చేసిన కుటుంబాలు ఏడుస్తున్నాయని అన్నారు. ఓవైపు వడ్ల కుప్పల మీద రైతులు తమ ప్రాణాలు కోల్పోతుంటే.. మరోవైపు కేసీఆర్ కుటుంబంతో పాటు ఎమ్మెల్యేలు, మంత్రులు విదేశాల్లో పెట్టుబడులు పెడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ ఇంట్లో ఐదు ఉద్యోగాలున్నాయని.. ఇప్పుడున్న చిన్నోడు పెద్దోడైతే, అతనికి కూడా ఓ ఉద్యోగం రెడీగా ఉందన్నారు. కానీ.. తెలంగాణలోని యువతకి మాత్రం ఉద్యోగాలు లేవన్నారు. కేసీఆర్ బిడ్డ లిక్కర్ కేసులో ఇరుక్కుందని.. మరి ఆమెను జైల్లో పెట్టాలా? వద్దా? అని ప్రశ్నించారు.

కేసీఆర్ కోట్లకు పడగలెత్తుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేశారని బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్రం రూ. 5 లక్షల కోట్ల అప్పుల్లో ఉందని.. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరి పేరు మీద రూ. 1 లక్ష అప్పు అయ్యిందని చెప్పారు. ధరణి పోర్టల్‌లో ఎవరి జాగ ఎవరి పేరు మీదుందో కూడా తెలియని పరిస్థితి నెలకొందన్నారు. బీజేపీ పాదయాత్రకు జనం రావట్లేదని టీఆర్ఎస్ తప్పుడు ప్రచారం చేస్తోందని.. మరి జనం రానప్పుడు భైంసా సభకు ఎందుకు అడ్డుకున్నారు? పాదయాత్రకు ఎందుకు అనుమతి ఇవ్వడం లేదు? అని ప్రశ్నల వర్షం కురిపించారు. కేసీఆర్​సభలు, కార్యక్రమాలకే జనం పోవట్లేదని.. పైసలిచ్చి చప్పట్లు కొట్టించుకునే పరిస్థితి టీఆర్ఎస్‌కు వచ్చిందని ఎద్దేవా చేశారు. నిధుల విషయంలోనూ టీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. కేంద్రం ఇస్తున్న నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి పనులు సాగుతున్నాయన్నారు.

రాష్ట్రానికి ప్రతీ పైసా కేంద్రం ఇస్తోందని.. రైతు వేదిక, రేషన్ బియ్యంకు అన్నింటికి కూడా నిధులు కేటాయించిందని బండి సంజయ్ తెలిపారు. కానీ, దాన్నుంచి దృష్టి మరల్చడం కోసం అసెంబ్లీ సమావేశాలు తీసుకొస్తున్నారన్నారు. మోడీని తిట్టి.. తాము అభివృద్ధి చేయని విషయాన్ని పక్కకు నెట్టే ప్రయత్నం టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తోందన్నారు. ‘‘బాపు బేటా లిక్కర్‌లో వాటా.. చెప్పాలి కేసీఅర్ కు టాటా’’, ‘‘సాలు దోర సెలవు దొరా’’ అంటూ బండి సంజయ్ నినాదాలు చేశారు.