Site icon NTV Telugu

Bandi Sanjay: తెలంగాణ గడ్డపై కాషాయ జెండాను రెపరెపలాడించేదాకా పోరాడుతా

Bandi Sanjay On Kcr

Bandi Sanjay On Kcr

Bandi Sanjay Sensational Comments In Khanapur Yatra: తెలంగాణ గడ్డపై కాషాయ జెండాను రెపరెపలాడించేదాకా తన పోరాటాన్ని కొనసాగిస్తానని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తేల్చి చెప్పారు. ఖానాపూర్ ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా మాట్లాడిన ఆయన.. సీఎం కేసీఆర్ యుద్ధం ప్రారంభించారని, తాము యుద్ధానికి కూడా సిద్ధమేనని అన్నారు. కేసులు, రౌడీ షీట్లు, దాడులకు భయపడే ప్రసక్తే లేదన్నారు. బీజేపీని బదనాం చేసేందుకు కేసీఆర్ కుట్రలను పన్నుతున్నారని ఆరోపణలు చేశారు. దేశం కోసం, ధర్మం కోసం, సమాజ శ్రేయస్సు కోసం అహర్నిశలు కష్టపడి పని చేస్తున్న బీఎల్ సంతోష్‌పై తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్నారు. ఒక్క పైసా దొరక్కపోయినా.. అవినీతి కేసు ఎలా పెడతారంటూ ఏసీబీ కోర్టు చెంప ఛెళ్లుమనిపించినా కేసీఆర్‌కు సిగ్గు రాలేదని వ్యాఖ్యానించారు.

కేసీఆర్ బిడ్డ దొంగ సారా దందా చేసిందని.. ఈ కేసులో అడ్డంగా బుక్కైన ఆమెను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తే, తెలంగాణ సెంటిమెంట్ రగిలించాలని కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని బండి సంజయ్ ఆరోపణలు చేశారు. కేసీఆర్ బిడ్డ చేసిన పనికి నేడు తెలంగాణ తలదించుకునే దుస్థితి వచ్చిందని.. కేసీఆర్ కుటుంబాన్ని దేశమంతా అసహ్యించుకుంటోందని పేర్కొన్నారు. ప్రజా సంగ్రామ యాత్రతో కేసీఆర్‌కు నిద్ర పట్టడం లేదన్నారు. ప్రజలకిచ్చిన హామీల అమలుకు పైసల్లేవంటూ కేసీఆర్ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ప్రజా సంగ్రామ యాత్రకు వస్తున్న ఆదరణ చూపి.. కేసీఆర్‌కు నిద్ర పట్టట్లేదన్నారు. ఎంతసేపు బిడ్డ జపమే చేస్తున్నారని, ఈనెల 11న బిడ్డ సంగతేంటో తెలుస్తుందని అన్నారు. ప్రశ్నించడానికే బీజేపీ పాదయాత్ర చేస్తోందని.. ప్రజల కష్టాలు, బాధలు తెలుసుకుంటూ వారికి భరోసా కల్పిస్తున్నామని చెప్పారు. కేసీఆర్ అవినీతి, కుటుంబ, నియంతృత్వ పాలనకు చరమగీతం పాడుతామని పేర్కొన్నారు.

బీజేపీ అధికారంలోకి వస్తే.. పేదలకు ఉచిత విద్య, వైద్యం అందిస్తామని బండి సంజయ్ హామీ ఇచ్చారు. అలాగే నిలువ నీడలేని పేదలకు ఇళ్లు కట్టిస్తామని, పంట నష్టపోయిన రైతులకు ఫసల్ బీమా యోజన పథకాన్ని పూర్తిగా అమలుచేసి ఆదుకుంటామని, ఖానాపూర్‌లోని పెండింగ్ ప్రాజెక్టులతో పాటు బ్రిడ్జీలన్నీ పూర్తి చేస్తామని మాటిచ్చారు. అన్ని పథకాల్లోనూ టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులందరికీ కమిషన్‌లు కావాల్సిందేనని.. పెట్రోల్ బంకులు, డిగ్రీ కాలేజీలన్నీ వాళ్లేనని అన్నారు. ఇక్కడ ఉద్యోగాలు లేక నిరుద్యోగులు గల్ఫ్ దేశాలకు పోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ఇచ్చిన ఇచ్చిన హామీలను నెరవేర్చాలని.. కేసీఆర్‌ను అడిగే దమ్ము టీఆర్ఎస్ నేతలకు ఉందా? అని ప్రశ్నించారు. కేంద్రం ఇస్తున్న నిధులతోనే తెలంగాణలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని.. ధాన్యం సేకరణకు కూడా మోడీ ప్రభుత్వమే నిధులు ఇస్తోందని చెప్పారు. తెలంగాణలో పేదోళ్ల రాజ్యం రావాలని పిలుపునిచ్చారు.

ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చేశారని, రూ.5 లక్షల కోట్లు అప్పు చేశారని బండి సంజయ్ పేర్కొన్నారు. మరోసారి కేసీఆర్‌కు అవకాశమిస్తే.. ఇంకో రూ.5 లక్షల కోట్ల అప్పు చేస్తారన్నారు. బెంగళూరు, హైదరాబాద్ డ్రగ్స్ కేసులను తాము రీఓపెన్ చేయిస్తామన్నారు. బీజేపీ ఏ మతానికీ వ్యతిరేకం కాదని, ఎవరినీ కించపరచలేదని స్పష్టం చేశారు. కానీ కేసీఆర్ ఆ ఒక్క వర్గాన్ని తప్ప, 80% హిందువుల్ని పట్టించుకోరన్నారు. మత మార్పిడి జరగొద్దని, లవ్ జిహాద్‌కు ఛాన్స్ ఇవ్వొద్దని పిలుపునిచ్చారు. హిందువుల జోలికొస్తే సహించేదే లేదని హెచ్చరించారు. ప్రజల కోసమే కొట్లాడుతుంటే తనపై లాఠీ చార్జ్ చేస్తున్నారని.. బండి సంజయ్‌కి జైలు కొత్త కాదని అన్నారు. దేశం కోసం, ధర్మం కోసం జైలుకి వెళ్లానన్నారు. ఇక ముగింపు సభకు జేపీ నడ్డా వస్తారని, ఆ సభను విజయవంతం చేయాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.

Exit mobile version