NTV Telugu Site icon

Bandi Sanjay: సీఎం కూడా కాపాడలేడంటూ.. పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్

Bandi Sanjay On Etela Rajen

Bandi Sanjay On Etela Rajen

Bandi Sanjay Responds On Etela Rajender Attack Episode: మునుగోడు మండలం పలివెలలో ఈటెల రాజేందర్ కాన్వాయ్‌పై జరిగిన దాడిని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రంగా ఖండించారు. ఈటెల ఇతరులకు హాని కలిగించే వ్యక్తం కాదన్నారు. హుజూరాబాద్ ఎన్నికల సమయంలోనూ ప్రభుత్వం ఎన్ని అడ్డంకులు సృష్టించినా.. ఈటెల గెలిచారని గుర్తు చేశారు. పలివెలలో ఈటల మాట్లాడుతున్న సమయంలో ఆయనపై దాడి చేశారని.. సీఎం పైసలతో గుండాయిజం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలను తక్కువ అంచనా వేయకండని సూచించారు. బీజేపీ కార్యకర్తలు ధర్మం కోసం పని చేస్తారని.. తమ సహనాన్ని పిరికితనంగా భావించవద్దని హెచ్చరించారు. ఈ వ్యవహారంపై ఎన్నికల కమిషన్ సీరియస్ చర్యలు తీసుకోవాలని కోరారు. ఏ అలజడి జరిగినా.. దానికి జిల్లా పోలీసులే పూర్తి బాధ్యత వహించాల్సి వస్తుందన్నారు. మీ ఉద్యోగాలు ఉండవని, మిమ్మల్ని ముఖ్యమంత్రి కూడా కాపాడలేడని పోలీసులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

కాగా.. పలివెలలో బీజేపీ తరఫున ప్రచారం చేసేందుకు ఈటెల రాజేందర్ రాగా, ఆయన కాన్వాయ్‌పై టీఆర్ఎస్ శ్రేణులు దాడికి దిగాయి. బీజేపీ శ్రేణులు కూడా ఎదురుదాడికి దిగడంతో.. ఇరు పార్టీలు శ్రేణులు కర్రలతో పరస్పరం కొట్టుకున్నాయి. పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టేందుకు ప్రయత్నించినా.. రాళ్లతోనూ దాడులు చేసుకున్నారు. ఈ దాడిలో ఈటల కాన్వాయ్‌లోని పలు వాహనాల అద్దాలు ధ్వంసం అవ్వడంతో పాటు ఈటెల పీఆర్వో కాలికి గాయమైంది. అటు బీజేపీ శ్రేణుల దాడిలో.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి, నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ జగదీశ్‌కూ కూడా గాయాలయ్యాయి. ఈ ఘటనపై ఈటెల రాజేందర్ అప్పుడే సీరియస్ అయ్యారు. టీఆర్ఎస్ శ్రేణులు తమపై దాడి చేస్తుంటే.. పోలీసులు చోద్యం చూస్తూ నిలుచున్నారని మండిపడ్డారు. అంతేకాదు.. ఈ దాడికి టీఆర్ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డే కారణమని ఆయన ఆరోపించారు.