Site icon NTV Telugu

Bandi Sanjay: బీజేపీతో బల ప్రదర్శనకు సిద్ధమా.. కేసీఆర్‌కు సవాల్

Bandi Sanjay Challenges Cm

Bandi Sanjay Challenges Cm

Bandi Sanjay Challenges CM KCR: పోలీసులను అడ్డం పెట్టుకొని టీఆర్ఎస్ ప్రభుత్వం గూండాగిరి చేస్తోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా జనగామలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. టీఆర్ఎస్ దాడులకు బీజేపీ భయపడదని, ఎర్రవాళ్లను & పచ్చవాళ్లను తెచ్చుకున్నా తాము ధైర్యంగా ముందుకు సాగుతామన్నారు. ఇదే సమయంలో బీజేపీతో బల ప్రదర్శనకు సిద్ధమా? అంటూ సీఎం కేసీఆర్‌కు సవాల్ విసిరారు. హిందూ ధర్మం కోసం బీజేపీ పని చేస్తుందని, పేదల కోసం అవసరమైతే గూండాగిరి కూడా చేస్తామని హెచ్చరించారు. బీజేపీ ఏ మతానికి, ప్రాంతానికి వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. 80 శాతం మంది ఉన్న హిందువులంతా ఓటు బ్యాంకుగా మారితేనే దేశాన్ని కాపాడుకోగలమన్నారు. ప్రజాసంగ్రామ యాత్రను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే.. తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.

ఇదే సమయంలో జనగామలో నెలకొన్న ఫ్లెక్సీల వివాదంపై మాట్లాడుతూ.. ఫ్లెక్సీలు పెట్టి నరేంద్ర మోదీ ప్రధానమంత్రి కాలేదన్నారు. బీజేపీ పార్టీ ప్రజల గుండెల్లో ఉంటుందన్నారు. జనగామ అడ్డాపై కాషాయ జెండా ఎగరడం ఖాయమని, నయీంకు పట్టిన గతే సీఎంకు పడుతుందని అన్నారు. టీఆర్ఎస్ చేస్తున్న తప్పులకు.. ఎన్నికల సమయంలో ప్రజలే సమాధానం చెప్తారన్నారు. పాలకుర్తిలో యాత్రను అడ్డుకొనేందుకు ప్రయత్నిస్తే… వేలాది మంది సభకు తరలివచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే.. షాపులు బంద్ చేయడం లేక పవర్ కట్‌కి పాల్పడడమో చేస్తున్నారని విమర్శించారు. అలాగే.. జనగామ జిల్లాలో రిజర్వాయర్ కడతామని ఇచ్చిన హామీని సీఎం విస్మరించారన్నారు. మిషన్ భగీరథ నీళ్లు వస్తే.. జనం నీళ్లు కొనేందుకు బయట ఎందుకు వెళ్తున్నారని నిలదీశారు. మెడికల్, ఐటీ, డిగ్రీ, పీజీ కాలేజీలు, నర్సింగ్ హోం, పెంబర్తి ఇండస్ట్రీయల్ కారిడార్, పాలకుర్తిని మున్సిపాలిటీ చేస్తామని ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ కేసీఆర్‌ని ప్రశ్నించారు.

అంతకుముందు యాత్రలో భాగంగా బండి సంజయ్ వివిధ వర్గాల ప్రజల్ని కలిసి, వారి బాధల్ని అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే అర్చకులతోనూ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా.. భగవద్గీతను కించపరిస్తే అడ్డుకుంటామని బండి సంజయ్ అన్నారు. ఇమామ్‌లకు ఇచ్చే గౌరవం అర్చకులకు ఇవ్వరా..? అని ప్రశ్నించారు. అర్చకులు అడ్డాకూలీ వద్ద అడుక్కునే దుస్థితి వచ్చిందని.. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే పేద బ్రాహ్మణులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే.. గౌడ సోదరుల సంక్షేమం కోసం కూడా బీజేపీ కృషి చేస్తుందని వివరించారు. గౌడన్నలను గోస పెడుతూ.. కేసీఆర్ పబ్బం గడుపుతున్నారని ఆరోపించారు. వారి పొట్ట గొట్టే చర్యలకు పాల్పడుతున్నారని.. ఇకపై ఈ అరాచకం ఏమాత్రం సాగబోదని అన్నారు.

Exit mobile version